పరిశ్రమలకు రాయితీ బకాయిలు | Sakshi
Sakshi News home page

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీ బకాయిలు

Published Mon, Jun 29 2020 3:14 AM

Subsidy dues for small and medium sized enterprises - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా విపత్తు సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రాయితీ బకాయిలను నేడు విడుదల చేయనుంది. దాదాపు లక్ష సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2014–15 నుంచి గత సర్కారు రూ.827.5 కోట్ల మేర బకాయిలు పెట్టింది. టీడీపీ సర్కారు బకాయిలతో పాటు ఈ ఏడాది రాయితీలు కూడా కలిపి రూ.962.62 కోట్లను రెండు విడతలుగా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈనెల 22వ తేదీన తొలివిడతగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.450.27 కోట్లను విడుదల చేశారు. మిగతా బకాయిలను జూన్‌ 29వ తేదీన విడుదల చేస్తామని అదే రోజు ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రెండో విడత బకాయిలను సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

10 లక్షల మంది జీవనోపాధికి సీఎం నిర్ణయంతో ఊరట..
ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ ఇచ్చిన మాట మేరకు రెండో విడత బకాయిలు రూ.512.35 కోట్లను (128 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు అదనపు ప్రోత్సాహకాలతో కలిపి) ముఖ్యమంత్రి జగన్‌ క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా ఆయా పరిశ్రమల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. రాష్ట్రంలో 98,000 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలుండగా వీటిపై ఆధారపడి దాదాపు పది లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. ఇంత మంది జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో పరిశ్రమలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా చెల్లించాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ పరిశ్రమలను ఈ విధంగా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం.

రీ స్టార్ట్‌ ప్యాకేజీలో చేయూత ఇలా..
రీ స్టార్ట్‌ ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలు నిలదొక్కుకునేందుకు కరోనా సమయంలో మూతబడ్డ మూడు నెలలకు సంబంధించి కరెంట్‌ ఫిక్స్‌డ్‌ డిమాండ్‌ ఛార్జీలు మొత్తం రూ.187.80 కోట్లను మాఫీ చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. 98,000 పరిశ్రమలపై ఆధారపడ్డ 10 లక్షల మందికి మేలు చేసేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

► తక్కువ వడ్డీపై వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాల కోసం రూ.200 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గరిష్టంగా రూ.10 లక్షల వరకు 6 నుంచి 8 శాతంతో రుణం మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. ఆరు నెలల మారటోరియం సమయంపోగా మూడేళ్లలో ఆ మొత్తం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది.
► ప్రభుత్వానికి అవసరమైన  25 శాతం వస్తువులు, సామాగ్రిని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందులో 4 శాతం ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఎంఎస్‌ఎంఈలు, 3 శాతం మహిళలకు చెందిన సంస్థల నుంచి సేకరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
► సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి కొనుగోలు చేసిన వస్తువులు, సామాగ్రికి కచ్చితంగా 45 రోజుల్లో బిల్లులు  చెల్లించాలని సీఎం జగన్‌ గతంలోనే అదేశించారు. ప్రోత్సాహక బకాయిల విడుదలతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.280 కోట్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.496 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. 

Advertisement
Advertisement