ఒకటే లక్ష్యం | Sakshi
Sakshi News home page

ఒకటే లక్ష్యం

Published Tue, Oct 8 2013 3:25 AM

our target is one

 సాక్షి, అనంతపురం :  
 ప్రజల అభీష్టం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉద్యమం హోరెత్తుతోంది. పార్టీ పిలుపు మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి విజయవంతమైంది. అనంతపురం నగరంలో వైఎస్సార్‌సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు  కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. గోరంట్లలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గంపల వెంకటరమణారెడ్డి, మండల కన్వీనర్ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ నిమ్మల కిష్ణప్ప ఇంటిని ముట్టడించారు. వెంటనే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనకపోతే ప్రజలు తరిమి కొడతారని ఎంపీని హెచ్చరించారు.
 
 దర్మవరం పట్టణంలోని కాలేజీ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు మానవహారం నిర్మించారు. హిందూపురంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు, బొత్స, కేసీఆర్, చిరంజీవి దిష్టిబొమ్మలను దహనం చేశారు. మడకశిరలో జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, దిగ్విజయ్‌దిష్టి బొమ్మలకు సమాధి కట్టారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు తెలిపారు. పెనుకొండలో ట్రాన్స్‌కో ఉద్యోగులు, యాడికిలో సమైక్యవాదులు చేపట్టిన రిలేదీక్షలకు వైఎస్సార్‌సీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. రాయదుర్గంలో ఉద్యోగుల రిలేదీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. కనగానపల్లిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కమిటీ సభ్యుడు అంకే లక్ష్మణ్ణ ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మకు సమాధి కట్టారు.
 
 జననేతకు సంఘీభావం
 రాష్ట్ర విభజనకు నిరసనగా జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావంగా జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకుల దీక్షలు కొనసాగుతున్నాయి. కళ్యాణదుర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, కదిరిలో పార్టీ నేత వజ్ర భాస్కర్‌రెడ్డి ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. వజ్ర భాస్కర్‌రెడ్డి దీక్షకు పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మహమ్మద్‌షాకీర్, మైనార్టీ నాయకులు ఆరీఫ్ అలీ తదితరులు మద్దతు ప్రకటించారు. పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయం ఎదుట వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సోమశేఖరరెడ్డి ఆధ్వర్యంలో 5 వేల మందితో ఒక్కరోజు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. రాయదుర్గంలో మూడో రోజూ ఆమరణ దీక్ష కొనసాగించిన వైఎస్సార్‌సీపీ నాయకుడు మహేష్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన్ను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సూచన మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రిలో దీక్ష విరమింపజేశారు. కళ్యాణదుర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మోకాళ్లపై నడుస్తూ.. జగన్ దీక్షకు మద్దతు తెలిపారు. జననేత జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ గుత్తిలోని బాలాంజనేయస్వామి ఆలయంలో పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.
 

Advertisement
Advertisement