గ్రామ సచివాలయ ఉద్యోగాలకు 15న నోటిఫికేషన్‌

Notification For AP Village Secretariats Jobs By July 15 - Sakshi

అవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలేనని యువతకు తెలియజెప్పండి: సీఎం 

సాక్షి, అమరావతి: ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం చొప్పున ఏర్పాటు ప్రక్రియను అక్టోబరు 2వతేదీ నాటికి పూర్తి చేసేలా వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుపై గురువారం ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. గ్రామ సచివాలయాల్లో పదేసి మంది చొప్పున కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి జులై 15వతేదీ కల్లా నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదేశించారు. 

పారదర్శకంగా ప్రక్రియ
గ్రామ సచివాలయాల ఉద్యోగులను మొదట రెండేళ్ల పాటు ప్రొబేషనరీగా ఉంచి, ఆ తర్వాత వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామన్న విషయాన్ని యువతకు స్పష్టంగా తెలిసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా అదనంగా మరో 10 మందికి ఈ ఉద్యోగాలు ఇస్తున్న విసయం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లా ఎంపిక కమిటీల ద్వారా రాతపరీక్ష నిర్వహించి అత్యంత పారదర్శక విధానంలో ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. 

స్థానిక ఎన్నికలపైనా చర్చ
గ్రామ సచివాలయాలకు సంబంధించి కసరత్తు అక్టోబరు వరకు జరుగుతున్నందున ఆ తర్వాతే గ్రామ పంచాయితీ, మండల పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ మొదలుపెడదామని సీఎం సూచించారు. ఇందుకు  సంబంధించి రిజర్వేషన్ల అంశంపై కొత్తగా చట్టం చేయాలని అధికారులు పేర్కొనగా ప్రతిపాదనలు పంపితే క్యాబినెట్‌లో చర్చించి, అవసరమైతే వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెట్టి చట్టం తెద్దామని సీఎం చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top