బూట్ల పేరిట రూ.కోట్లకు ఎసరు! | Massive Corruption in SSA During the Government of TDP | Sakshi
Sakshi News home page

బూట్ల పేరిట రూ.కోట్లకు ఎసరు!

Aug 12 2019 4:38 AM | Updated on Aug 12 2019 4:48 AM

Massive Corruption in SSA During the Government of TDP - Sakshi

సాక్షి, అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యా శాఖలో చోటుచేసుకున్న అవకతవకలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్ల పంపిణీ పేరిట రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. కేవలం రూ.93.70 అయ్యే ఒక్కో జత బూట్లు, రెండు జతల సాక్సులను ఏకంగా రూ.254 ధరకు కొనుగోలు చేసేలా ప్రైవేట్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. అంటే రూ.160.30 అదనంగా చెల్లించి, భారీగా కమీషన్లు మింగేయడానికి పక్కాగా స్కెచ్‌ వేశారు. రూ.47 కోట్ల మేర ప్రజాధనానికి ఎసరు పెట్టారు. అప్పటి టీడీపీ మంత్రులతోపాటు సర్వశిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) రాష్ట్ర ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన జి.శ్రీనివాస్‌ ఈ ఒప్పందాలు చేసుకోవడంలో అడ్డగోలుగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై తాజాగా దృష్టి సారించింది. సర్వశిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఈ బూట్ల కొనుగోలు ఒప్పందం, ప్రస్తుత స్థితిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రైవేట్‌ కంపెనీలకు నిధుల చెల్లింపును నిలిపివేశారు.  

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే... 
సర్వశిక్షా అభియాన్‌ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు బూట్లు పంపిణీ చేయాలని టీడీపీ సర్కారు హయాంలో నిర్ణయించారు. ఈ మేరకు ఢిల్లీ, హరియాణాకు చెందిన నాలుగు చెప్పుల కంపెనీలతో (ఎక్స్‌ఓ ఫుట్‌వేర్, మంజిత్‌ ప్లాస్టిక్, ఎం.బి.రబ్బర్, టుడే ఫుట్‌వేర్‌) ఒప్పందం చేసుకున్నారు. 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 29,71,098 మందికి బూట్ల పంపిణీ కోసం రూ.76 కోట్లతో ఒప్పందం చేసుకుంటూ ఎస్‌ఎస్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌లకు రూ.254 చొప్పున ధర నిర్ణయించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన అనంతరం ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తరువాత అప్పటి ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ జి.శ్రీనివాస్‌ హడావుడిగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయా కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చారు. ఎస్పీడీ జి.శ్రీనివాస్‌ ఉత్తరప్రదేశ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా ఉంటూ నాలుగేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటేషన్‌పై వచ్చారు. పైరవీ ద్వారా ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీగా పోస్టింగ్‌ సంపాదించారు. ఉత్తరప్రదేశ్‌లో పని చేస్తున్నప్పుడే సదరు చెప్పుల కంపెనీలతో ఆయన సంబంధాలున్నాయి. అవే కంపెనీలకు ఏపీ ఎస్‌ఎస్‌ఏ ద్వారా బూట్ల పంపిణీ ఆర్డర్లు కట్టబెట్టారు.

అదనంగా ఒక్క పైసా కూడా చెల్లించం.. 
టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగిన అవినీతిపై వైఎస్సార్‌సీపీ సర్కారు దృష్టి సారించింది. అప్పటి ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ జి.శ్రీనివాస్‌ను తప్పించింది. ఎస్పీడీగా వాడ్రేవు చినవీరభద్రుడిని నియమించింది. బూట్ల పంపిణీని నిలిపివేయాలని ఆయా కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీగా శ్రీనివాస్‌ను ప్రభుత్వం తప్పించడంతో బూట్ల కొనుగోలు ఒప్పందం రద్దవుతుందని భావించిన ఆయా ప్రైవేట్‌ కంపెనీలు బూట్లు, సాక్స్‌లను ఆయా జిల్లాలకు హడావుడిగా తరలించాయి. నిలిపివేత ఉత్తర్వులు అందేలోపే జిల్లాల్లో ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అధికారులతో సంతకాలు చేయించాయి. బూట్ల సరఫరా ఒప్పందంలో జరిగిన అవినీతిపై పరిశీలన జరుగుతోందని, ఆ కంపెనీలకు అదనంగా నయాపైసా కూడా చెల్లించబోమని వాడ్రేవు చినవీరభద్రుడు స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు.  

యూపీలో రూ.93.70.. ఏపీలో రూ.254 
ఉత్తరప్రదేశ్‌ సర్వశిక్ష అభియాన్‌ ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌లకు రూ.93.70 చెల్లించేలా ఒప్పందం చేసుకొని ఎక్స్‌ఓ ఫుట్‌వేర్, మంజిత్‌ ప్లాస్టిక్, ఎం.బి.రబ్బర్, టుడే ఫుట్‌వేర్‌ కంపెనీలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్డర్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీగా ఉన్న శ్రీనివాస్‌ మాత్రం అవే బూట్లు, సాక్సుల పంపిణీకి గాను అవే కంపెనీలకు రూ.254 చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. అంటే రూ.160.30 అదనం అన్నమాట. ఈ వ్యవహారం వెనుక ఎంతమేర కమీషన్లు చేతులు మారాయో అర్థం చేసుకోవచ్చు. రూ.93.70 చొప్పున చెల్లిస్తే ఏపీలోని 29,71,098 మంది విద్యార్థులకు రూ.27.83 కోట్లు మాత్రమే ఖర్చయ్యేది. కానీ, రూ.254 చెల్లించేలా ఒప్పందం చేసుకోవడం వల్ల దాదాపు రూ.75.46 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అంటే రూ.47.63 కోట్లు అధికం. టీడీపీ పాలకుల కమీషన్ల కక్కుర్తి వల్ల ఖజానాకు భారీగా గండి పడే పరిస్థితి ఉత్పన్నమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement