నా ఇష్టం.. నేను కానిస్టేబుల్‌ను!

నా ఇష్టం.. నేను కానిస్టేబుల్‌ను!


- ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సుకు అడ్డంగా పెట్టిన బైకు

- 20 నిమిషాలకుపైగా నిలిచిన ట్రాఫిక్‌

- ప్రజల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కానిస్టేబుల్‌
ఒంగోలు: రవాణ శాఖ కానిస్టేబుల్‌ ఒకరు నగరంలోని నెల్లూరు బస్టాండ్‌ సమీపంలో శనివారం మధ్యాహ్నం కాసేపు హడావుడి సృష్టించాడు. మధ్యాహ్నం కందుకూరు వెళ్తున్న ఆర్టీసీ డబుల్‌ స్టాప్‌ బస్సుకు తన మోటారు సైకిల్‌ అడ్డంగా పెట్టి నానా బీభత్సం చేశాడు. ఇతడి చేష్టలకు నగరంలోని నెల్లూరు బస్టాండ్‌ సెంటర్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.దాదాపు 20 నిమిషాలకు పైగా ట్రాఫిక్‌ ఆగిపోయింది. బస్సు డ్రైవర్‌తో కానిస్టేబుల్‌ ఘర్షణకు దిగాడు. తాను ఆర్టీఓ కానిస్టేబుల్‌నంటూ డ్రైవర్‌పైకి దూకాడు. ట్రాఫిక్‌లో నిలిచిపోయిన వాహనదారులు, బస్సులోని ప్రయాణికులంతా కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వినకుండా  డ్రైవర్‌తో ఘర్షణకు దిగుతున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ప్రయాణికులు హెచ్చరించడంతో అప్పుడుకానీ బస్సుకు అడ్డంగా ఉంచిన మోటారు సైకిల్‌ను పక్కకు తీయలేదు.ఏమైందంటే..?

కానిస్టేబుల్‌ నెల్లూరు బస్టాండ్‌లోని రాజధాని హోటల్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌లో పెట్రోలు కొట్టించుకొని రోడ్డు మీదకు వచ్చాడు. పెట్రోల్‌ బంక్‌ నుంచి ఇవతల వైపునకు తన మోటారు సైకిల్‌పై వస్తున్నాడు. ఈలోగా ఏపీ 27 టీవై 7299 (సర్వీస్‌ నంబర్‌–5868) ఆర్టీసీ డబుల్‌ స్టాఫ్‌ బస్సు కందుకూరు వెళ్తోంది. తాను వస్తున్నా అడ్డదిడ్డంగా బస్సును రానిచ్చాడని ఆగ్రహించిన కానిస్టేబుల్‌.. బస్సును ఓవర్‌టేక్‌ చేసి తన మోటారు సైకిల్‌ను అడ్డంగా పెట్టి రాద్దాంతం సృష్టించాడు.

Back to Top