అవినీతి, వివక్షకు తావు లేదు | CM YS Jagan in a review with the authorities on the door delivery of pensions | Sakshi
Sakshi News home page

అవినీతి, వివక్షకు తావు లేదు

Feb 2 2020 4:24 AM | Updated on Feb 2 2020 10:55 AM

CM YS Jagan in a review with the authorities on the door delivery of pensions - Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ పథకాలలో మధ్యవర్తుల ప్రమేయం, అవినీతి, లంచగొండి తనం, వివక్ష అన్నది లేకుండా ఉండేందుకే పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల గడప వద్దకే చేర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. శనివారం నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ కార్యక్రమం అమలు తీరుపై సీఎం తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. పెన్షన్ల పంపిణీపై ఆరా తీశారు.

గతంలో పెన్షన్ల కోసం క్యూలో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేదని, మధ్యవర్తుల ప్రమేయం ఉండేదని, పెన్షన్ల కింద ఇచ్చే సొమ్ములో అవినీతికి పాల్పడేవారని, ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవంటూ లబ్ధిదారుల నుంచి వచ్చిన స్పందనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దే పెన్షన్లు అందించడంతో వారంతా చాలా ఆనందం వ్యక్తం చేశారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీలు చూడకుండా.. ఓటు వేయని వారికి కూడా పథకాలు అందిస్తున్నామన్నారు. 

అర్హులందరికీ పథకాలు
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. అర్హులైన వారు మిగిలిపోతే ఎవర్ని.. ఎలా సంప్రదించాలి.. ఎలా దరఖాస్తు చేయాలన్నదానిపై ఆ జాబితాల కిందే సమాచారం ఉంచామని చెప్పారు. పింఛన్లకు అర్హులై ఉండీ కూడా రాకపోతే ఆందోళన పడవద్దని, గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి 5 రోజుల్లో మంజూరు చేస్తారన్నారు. ఇదే చిత్తశుద్ధి, పారదర్శకతతో మరింత సమర్థవంతంగా అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పారు. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు అభినందనలు
సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌
పింఛన్లను గడప వద్దకే చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన రెండు ట్వీట్లు చేశారు. ‘పెన్షన్లను గడప వద్దకే చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు అభినందనలు. అవినీతి, వివక్ష లేకుండా 54.6 లక్షల మందికి ఇంటి వద్దే పెన్షన్‌ ఇస్తుంటే వారి కళ్లలో కనిపించిన సంతోషం నా బాధ్యతను మరింత పెంచింది. దేవుడి దయ, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమైంది’ అని ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో ‘ఎన్నికలకు ముందు వచ్చే పెన్షన్‌ రూ.వెయ్యి కాకుండా ఇప్పుడు 2,250 వచ్చింది. పెన్షన్‌ వయస్సు కూడా 65 ఏళ్ల నుంచి 60కి తగ్గించాం. కొత్తగా 6.11 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోండి. వెంటనే వాటిని పరిశీలించి మంజూరు చేస్తారు’ అని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement