
రాజీ కుదిర్చిన జడ్జి గోపీకృష్ణ లోక్ అదాలత్ అవార్డు జారీ
ఖలీల్‌వాడి(నిజామాబాద్): దీర్ఘకాలిక భూ వివాదాన్ని నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి కుమారం గోపీకృష్ణ పరిష్కరించారు. 30 గుంటల భూమి కోసం 23న్నర ఏళ్లుగా ఇరువర్గాలు న్యాయపోరాటం చేయగా జడ్జి రాజీకుదిర్చి లోక్ అదాలత్ అవార్డు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట్ మండలం దర్యాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యక్తి బిల్లి చిన్న గంగారాం వద్ద 30 గుంటల భూమిని 2002 మార్చి 7న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.
కాగా, ఆ భూమి తమ పూరీ్వకులదని, అమ్మే హక్కు తమ తండ్రికి లేదని చిన్న గంగారాం కుమారులు పెద్ద గంగాధర్, గంగరాం, సత్యనారాయణ, గాం«దీలు సంతోష్ రెడ్డితో గొడవపడుతూ ఇబ్బందులకు గురి చేసేవారు. దీంతో సంతోష్ రెడ్డి నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 2002 సెపె్టంబర్ 2న సివిల్ దావా వేయగా, 2004 ఆగస్టు 18న అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆ భూమిని సంతోష్‌రెడ్డి ఇతరులకు విక్రయించాడు. అదే సమయంలో జూనియర్ సివిల్ కోర్టు తీర్పును గంగారాం కుటుంబం జిల్లా కోర్టులో అప్పీలు చేసింది. అక్కడ కూడా వారు ఓడిపోయారు. అనంతరం మళ్లీ గొడవలు జరగగా, సంతోష్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ పరిశీలించిన కోర్టు గంగారాం కొడుకులకు నెల రోజుల సివిల్ జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేసి స్టే తెచ్చుకున్నారు. కేసు పూర్వాపరాలు అధ్యయనం చేసిన జడ్జి గోపీకృష్ణ, సంతోష్ రెడ్డి తరఫు న్యాయవాది జక్కుల వెంకటేశ్వర్, బిల్లి గంగరాం కుటుంబసభ్యుల తరఫు న్యాయవాది శ్రీహరి ఆచార్యతో సంప్రదింపులు జరిపి రాజీవైపు నడిపించారు. భూమిని ఇరువర్గాలకు సమభాగంగా పంచి వివాదానికి అంతిమ పరిష్కారం చూపారు. కక్షిదారుల తరఫున న్యాయవాదులతో లోక్ అదాలత్ బెంచ్‌లో ఒక ఉమ్మడి రాజీ పరిష్కార పిటిషన్ దాఖలు చేయడంతో అవార్డును జారీ చేశారు.