
వైఎస్సార్ కడప: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జయచంద్ర రెడ్డి భగ్గుమన్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాక్షి పత్రికపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన విమర్శలను తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె అవినీతి చిట్టా బయట పెడుతుందనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మాధవిరెడ్డిపై అన్ని వార్తా పత్రికల్లో, టీవీ చానెల్స్ లో ఇప్పటికే కథనాలు వస్తున్నాయని గుర్తుచేశారు.
జిల్లాలో ఆమె చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఆయన అన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని చెరువు స్థలాల్లో వెంచర్లు వేస్తున్నారని తమకు ఫిర్యాదులు వచ్చాయని ఆయన చెప్పారు. మాధవిరెడ్డి అనుచరులు బహిరంగంగానే అవినీతి పనులు చేస్తున్నారన్నారు. స్థానిక బిల్డర్ల నుంచి కూడా లక్షల్లో వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యేపై జయచంద్రారెడ్డి ఆరోపించారు.
ఏపీలో కూటమి సర్కార్ మొదలైన సమయం నుంచి కడపలో అక్రమాలు పెరిగిపోయాయని ప్రజలు ప్రత్యక్షంగానే చెబుతున్నారు. దేవుని కడపలోని 450 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు ప్లాన్ వేశారు. తప్పడు డాక్యుమెంట్లు తయారు చేసి ఇప్పటికే అక్కడ ప్లాట్లు వేసేందుకు పనులు కూడా ప్రారంభించారు. దానిని స్థానిక రైతులు అడ్డుకోవడంతో అసలు విషయం బయటకొచ్చింది. కోట్ల రూపాయలు విలువ చేసే 450 ఏకరాల భూమిని కొట్టేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు స్కెచ్ చేశారు. పనులు ఆపకపోతే చూస్తూ తాము సహించబోమని రైతులు హెచ్చరించారు. స్థానిక రైతులు చెప్పిన ఇదే విషయాన్ని సాక్షి పత్రిక ప్రచురణ చేయడంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అక్కసు వెల్లగక్కిన విషయం తెలిసిందే.