
పీజీఆర్‌ఎస్‌కు 93 వినతులు
బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి ప్రజల నుంచి 93 వినతులు అందాయి. జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చి అర్జీదారులు వినతులు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వినతుల్లో చట్టపరమైన సమస్యలను అక్కడికక్కడే ఆయా స్టేషన్ అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, నగదు మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసం, అత్తింటి వేధింపులు తదితర ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ దృష్టికి వచ్చిన వినతులు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐలు మోహన్‌రెడ్డి, సూర్యమౌళి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
● ముగ్గురి పరిస్థితి విషమం
చాగలమర్రి: మండలంలోని నగళ్లపాడు గ్రామ సమీపంలోని 40వ నెంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాలు.. హైదరాబాద్ చందానగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో కారులో తిరుపతికి బయలు దేరారు. మార్గమధ్యలోని నగళ్లపాడు వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. అంతటితో ఆగక ఎదురుగా వచ్చే హైదరాబాద్ బండ్లగూడ కాళికామందిర్‌కు చెందిన మందా అశోక్‌రెడ్డి కారును ఢీకొంది. ప్రమాదంలో అశోక్ రెడ్డి, అతని కుమారుడు నరేన్, మరో మహిళ సరితతో పాటు ప్రమాదానికి కారణమైన కారులోని శ్రీకాంత్, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను టోల్ ప్లాజా అంబులెన్సులో స్థానిక కేరళ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి తీవ్రంగా ఉన్న ముగ్గురిని నంద్యాల ఉదయానంద ఆసుపత్రికి తరలించారు. అశోక్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా అశోక్ రెడ్డి తన తల్లిదండ్రుల పెళ్లి రోజును పురస్కరించుకుని అరుణాచలం వెళ్లి తిరిగి హైదరాబాదుకు వెళ్తుండగా ప్రమాదం చేసుకున్నట్లు సమాచారం.

పీజీఆర్‌ఎస్‌కు 93 వినతులు