
స్వీయ లోటుపాట్లను సరిదిద్దుకోవటంలో న్యాయవ్యవస్థ సక్రమంగా వ్యవహరించటం లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న రెండు నిర్ణయాలు ఎన్నదగి నవి. ఇప్పటికే 21 మంది న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించగా, వాటిని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మొన్న మార్చి 4న ఢిల్లీలోని తన అధికార నివాసంలో భారీ యెత్తున కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకూ, ప్రధాని నరేంద్ర మోదీకీ లేఖ రాయటం కీలక పరిణామం. ఆ ఉదంతంపై విచారణకు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికనూ, జస్టిస్ వర్మ ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని కూడా దానికి జతపరిచారు.
అవినీతి మకిలి అంటిన న్యాయమూర్తుల్ని తొలగించటమనే ప్రక్రియ చాలా సుదీర్ఘమైనదీ,సంక్లిష్టమైనదీ. న్యాయమూర్తిపై ఆరోపణలొచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంత ర్గత విచారణ కమిటీని నియమించటం, అది ఇచ్చే నివేదికపై నిందపడిన న్యాయమూర్తి అభిప్రా యాన్ని కోరటం, ఆ తర్వాత అవసరమనుకుంటే రాజీనామా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేయమని అడగటం రివాజుగా వస్తోంది. అందుకు నిరాకరిస్తే పార్లమెంటులో అభిశంసన తీర్మానం ద్వారా తొలగించమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేస్తారు. ఈ తీర్మానం కోసం ఇచ్చే నోటీసుపై లోక్‌సభలో కనీసం 150 మంది ఎంపీలూ, రాజ్యసభలో కనీసం 50 మందిఎంపీలూ సంతకాలు పెట్టాల్సివుంటుంది.
ఆ తీర్మానాన్ని అనుమతించాలో లేదో స్పీకర్ లేదా రాజ్య సభ చైర్మన్ నిర్ణయిస్తారు. రాజ్యాంగంలోని 124, 218 అధికరణలు దుర్వర్తన లేదా అసమర్థత ఆరోపణల ఆధారంగా న్యాయమూర్తుల తొలగింపునకు అవకాశాన్నిస్తున్నాయి. అయితే ఇన్ని దశా బ్దాల్లో ఈ ప్రక్రియ కింద పదవిని కోల్పోయిన న్యాయమూర్తి ఒక్కరూ లేరంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాగని ఫిర్యాదుల సంఖ్య తక్కువేం లేదు. 2017–2021 మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికీ, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకూ 1,631 ఫిర్యాదులు వచ్చాయని చెబుతున్నారు. అయితే అంతర్గత విచారణ ప్రక్రియ రహస్యమైనది కావటంవల్ల ఎంతమంది న్యాయమూర్తులపై విచారణ జరిగిందో, ఎందరిపై చర్యలు మొదలయ్యాయో తెలియదు.
తొలిసారి 1993లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామస్వామిపై నిధుల దుర్వినియోగం విషయంలో వచ్చిన ఆరోపణల పర్యవసానంగా పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ నడిచింది. అప్పట్లో ఆయనపై వచ్చిన 14 ఆరోపణల్లో పదకొండింటికి ఆధారాలున్నాయని తేల్చారు. తీరా పార్లమెంటులో అభిశంసన తీర్మానంపై జరిగిన వోటింగ్‌కు కాంగ్రెస్ గైర్హాజర్ కావటంతో అది వీగిపోయింది. 2009లో అప్పటి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీడీ దినకరన్‌పైనా ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న అభియోగం వచ్చింది. అభిశంసన ప్రక్రియ ప్రారంభం కాగానే ఆయన రాజీనామా చేయటంతో అది అర్ధాంతరంగా ముగిసింది.
మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె. వీరాస్వామిపై అవినీతి కేసులో సీబీఐ చార్జిషీటు నమోదు చేసింది. కానీ విచారణ ముందుకు సాగకుండా ఆయన అన్నివిధాలా ప్రయత్నించారు. చివరకు 2010లో ఆయన మరణించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ విశ్వహిందూ పరిషత్ సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సుప్రీంకోర్టు కొలీజియం బహిరంగ క్షమాపణ చెప్పాలని, వివరణనివ్వాలని కోరింది కూడా. కానీ ఇంతవరకూ అదేం జరగలేదు. అదే హైకోర్టుకు చెందిన జస్టిస్ ఎస్‌ఎన్ శుక్లా అవినీతిపై అంతర్గత కమిటీకి ఆధారాలు లభ్యమయ్యా యన్నారు. కేసుల విచారణ పని అప్పగించటం మానే శారు.
కానీ ఆయన రిటైరయ్యేవరకూ న్యాయ మూర్తిగా జీతభత్యాలు తీసుకుంటూనే వున్నారు. అందుకే అవినీతి ఆరోపణలున్న ప్రభుత్వోద్యో గులూ, రాజకీయ పక్షాల నేతల మాదిరి న్యాయమూ ర్తులపై విచారణ సాగటం లేదన్న విమర్శలుంటున్నాయి. జస్టిస్ వర్మ వ్యవహారశైలి మొదటినుంచీ అనుమానాలకు తావిచ్చేదిగావుంది. మార్చి 14–15 రాత్రి అగ్నిప్రమాదం జరిగినప్పుడు కొన్ని కరెన్సీ కట్టలు తగలబడినా, మిగిలినవి సురక్షతంగా వున్నాయని మొదటగా అక్కడికొచ్చిన అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు చెప్పగా... అటుపై బాగున్న కట్టలు మాయమయ్యాయి. దీనిపై జస్టిస్ వర్మ వివరణ సంతృప్తికరంగా లేకపోవటంతో వ్యవహారం అభిశంసన వరకూ వెళ్లింది. ఇప్పటికే కేసుల విచారణనుంచి ఆయన్ను తప్పించారు.
నిజానికి జస్టిస్ వర్మ ఉదంతం ప్రభావంతోనే న్యాయవ్యవస్థపై నింద పడకూడదన్న ఉద్దేశంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన నిర్ణయం తీసుకున్నారు. మన దేశంలో న్యాయమూర్తులు ఆస్తులు ప్రకటిస్తున్నా ఎవరైనా సమాచార హక్కు చట్టంకింద కోరితే తప్ప వివరాలు బహిరంగపరిచే విధానం లేదు. బ్రిటన్, కెనడాల్లోనూ అంతే. అయితే అమెరికా, దక్షిణ కొరియా, అర్జెంటీనా, రష్యాల్లో చట్టప్రకారం న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడి తప్పనిసరి.
ఏదేమైనా జస్టిస్ సంజీవ్ ఖన్నా తాజా నిర్ణయం పారదర్శకత దిశగా ఒక కీలకమైన ముందడుగనే చెప్పాలి. అయితే నిందపడిన న్యాయమూర్తులను లోక్‌పాల్ చట్టం కింద విచారించవచ్చునా లేదా అన్నది ఇంకా తేలాల్సేవుంది. మొత్తానికి స్వీయప్రక్షాళనకు న్యాయవ్యవస్థ నడుం బిగించటంప్రశంసనీయమైన పరిణామం.