
పోలీసు బందోబస్తుతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు
మామిడికుదురు: పాశర్లపూడి గ్రామంలోని కై కాలపేటలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. 216వ నంబర్ జాతీయ రహదారి వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎన్‌హెచ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రయత్నించారు. దీన్ని నిర్వాసితులు అడుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. తమకు సెంట్ల రూపేణా పరిహారం ఇస్తామంటున్నారని అలా కాకుండా గజాల లెక్కన, ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎంతోకాలం నుంచి పోరాటం చేస్తున్నా తమకు న్యాయం చేయడం లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. నిర్వాసితులైన మహిళలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు, నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎన్‌హెచ్ ఏఈఈ వెంకటరమణ, ఎమ్మార్వో శరణ్య నిర్వాసితులతో మాట్లాడారు. తమకు న్యాయం జరిగే వరకు పనులు జరగనిచ్చేది లేదంటూ నిర్వాసితులు ధర్నా చేశారు. ఏడేళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని, తమకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదని గెడ్డం గంగాధర్, చొల్లంగి ధర్మరాజు, గెడ్డం లెనిన్, పెచ్చెట్టి చంద్రరావు వాపోయారు. పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీంతో పనులను అడ్డుకుంటున్న నిర్వాసితులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ బైపాస్ రోడ్డు పనులు ప్రారంభించారు. పాశర్లపూడి గ్రామంలోని బైపాస్ రోడ్డు నిర్మాణానికి 66 మంది రైతులకు చెందిన ఏడెకరాల భూమికి సంబంధించి సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీనిలో 10 మంది రైతులు నష్ట పరిహారం తీసుకున్నారన్నారు. మిగిలినవారు పరిహారం తీసుకోలేదని చెప్పారు. ఇందులో 16 మంది రైతులకు సంబంధించి 1.32 ఎకరాల భూమిని ఇచ్చేందుకు నిర్వాసితులు నిరాకరించడంతో ఇంత కాలం బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోయాయన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేపట్టామని చెప్పారు.
పాశర్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత
పోలీసుల అదుపులో నిర్వాసితులు

పోలీసు బందోబస్తుతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు