
న్యూఢిల్లీ: వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం కలిగిన వారు దాఖలు చేయాల్సిన ఐటీఆర్ పత్రం ఫారమ్ 3ని ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. ఐటీఆర్ 3ని ఏప్రిల్ 30న నోటిఫై చేసినట్టు ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) వ్యాపారం నుంచి లాభ/నష్టాలు ఉంటే లేదా వృత్తిపరమైన ఆదాయం ఉంటే వారికి ఐటీఆర్ ఫారమ్ 3 వర్తిస్తుంది. ‘షెడ్యూల్ ఏఎల్’ కింద వెల్లడించాల్సిన ఆస్తులు/అప్పుల పరిమితి ఇప్పటివరకు రూ.50 లక్షలుగా ఉంటే రూ.కోటికి పెంచింది.
దీనివల్ల ఆలోపు ఆదాయం ఉంటే వివరాలు వెల్లడించాల్సిన భారం తొలగిపోయింది. ఐటీఆర్ క్యాపిటల్ గెయిన్స్ షెడ్యూల్‌లో మూలధన లాభాలను ఇకపై 2024 జూలై 23 ముందు, తర్వాత వాటిని వేరుగా చూపించాల్సి ఉంటుంది. బడ్జెట్‌లో రియల్ ఎస్టేట్‌పై మూలధన లాభాలను గతంలో ఉన్న 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించడం తెలిసిందే. దీని ప్రకారం 2024 జూలై 23కు ముందు ప్రాపర్టీని కొనుగోలు చేసిన వారు కొత్త పథకం కింద ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా 12.5 శాతం మూలధన లాభాల పన్నును ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే పాత విధానంలో మాదిరిగా ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20 శాతం పన్ను అయినా చెల్లించొచ్చు.