
ఆదాయపు పన్ను దాఖలుకు సమయం రానే వచ్చింది. ఐటీఆర్ దాఖలుకు చివరితేదీని ప్రభుత్వం జులై 31గా నిర్ణయించింది. చివరి నిమిషంలో గందరగోళంగా పన్ను రిటర్న్‌లు ఫైల్ చేస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుని వీలైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి దాఖలుకు ఎలాంటి ధ్రువపత్రాలు సమకూర్చుకోవాలి.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుందాం.
అవసరమైన డాక్యుమెంట్లు: పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫారం 16 (వేతన జీవుల కోసం), బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోవడం: మీ ఆదాయ వనరు ఆధారంగా తగిన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫారాన్ని ఎంచుకోవాలి. ఉదా. వేతన జీవులు ఐటీఆర్ -1, వ్యాపార యజమానులు ఐటీఆర్ -3 తీసుకోవాలి.
పన్ను లెక్కలు: మీ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, మినహాయింపులు, చెల్లించాల్సిన మొత్తం పన్నును లెక్కించాలి. ఈ వివరాలు ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఎంతో ఉపయోగపడుతాయి.
ఆన్‌లైన్‌లో ఐటీఆర్ దాఖలు: ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయి మీ వివరాలను నమోదు చేయాలి. మీ వద్ద ఉన్న ధ్రువపత్రాలు, ఇతర ఆధారాలతో రిటర్న్‌లు దాఖలు చేయవచ్చు.
ట్యాక్స్ రిటర్న్ వెరిఫై: ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి లేదా మీరు సంతకం చేసిన ఫిజికల్ కాపీలో వివరాలు నమోదు చేసి ఇన్‌కమ్ ట్యాక్ విభాగానికి పంపడం ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. చాలామంది దీన్ని విస్మరిస్తారు. కేవలం ఐటీఆర్ ఫైల్ చేయడంతోనే ప్రక్రియ పూర్తి అయిపోతుందని అనుకుంటారు. కానీ కచ్చితంగా ట్యాక్స్ రిటర్న్‌లను వెరిఫై చేయాలి. అప్పుడే మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.
ఇదీ చదవండి: ఐపీఎల్ నిలిపివేత.. కంపెనీలకు నష్టం ఎంతంటే..
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ చివరి తేదీలు
వ్యక్తులు, ఉద్యోగులు: జులై 31, 2025
ఆడిట్ అవసరమయ్యే వ్యాపారాలు: అక్టోబర్ 31, 2025
కంపెనీలు: అక్టోబర్ 31, 2025