కేటుగాళ్లు కొత్త ఎత్తులు | - | Sakshi
Sakshi News home page

కేటుగాళ్లు కొత్త ఎత్తులు

Published Wed, May 7 2025 1:19 AM | Last Updated on Wed, May 7 2025 1:19 AM

కేటుగాళ్లు కొత్త ఎత్తులు

కేటుగాళ్లు కొత్త ఎత్తులు

● ఫుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ నుంచి అంటూ రెస్టారెంట్‌ ఓనర్లకు ఫోన్లు ● నోటీసు ఇవ్వాలా? గూగుల్‌ పే చేస్తావా అంటూ బెదిరింపులు ● రాణాచౌదరి పేరుతో నెంబర్‌ షేర్‌ చేస్తున్న మాయగాళ్లు ● విశాఖ, అరకు యజమానుల నుంచి వసూళ్లు?

విశాఖ సిటీ : హలో.. ఫుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ నుంచి మాట్లాడుతున్నాం. మీ రెస్టారెంట్‌పై ఫిర్యాదులు వచ్చాయి. రైడ్‌కు వస్తున్నాం. సీజ్‌ చేయమంటారా? లేదంటే గూగుల్‌ పే నెంబర్‌ ఇస్తా.. డబ్బులు పంపిస్తారా? అంటూ ఉమ్మడి విశాఖలో కేటుగాళ్లు బెదిరింపులకు దిగుతున్నారు. రెస్టారెంట్‌ యజమానులకు ఫోన్లు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గూగుల్‌ పే నెంబర్‌కు డబ్బులు పంపించాలని, లేదంటే తనిఖీలకు వచ్చి కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే విశాఖలోనే కాకుండా అరకు రెస్టారెంట్‌, హోటల్‌ నిర్వాహకులకు ఫోన్లు చేస్తూ పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం.

రాణాచౌదరి పేరుతో ఫోన్లు

విశాఖ, అరకుకు చెందిన హోటల్‌, రెస్టారెంట్‌ వ్యాపారులకు ఇటీవల కాలంలో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ రాణా చౌదరి అనే పేరుతో వరుసగా ఫోన్లు వస్తున్నాయి. లైసెన్సులు తీసుకోకుండా వ్యాపారాలు చేస్తున్నారని, రెస్టారెంట్లు సీజ్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. తమ వద్ద ఫుడ్‌ లైసెన్సు ఉందని చెప్పినప్పటికీ.. ట్రేడ్‌ లైసెన్స్‌ ఎక్స్‌పైర్‌ అయిందని, లేబర్‌ లైసెన్సు లేదని ఫోన్‌లో గదమాయించడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఫుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ అధికారికి ఫుడ్‌ లైసెన్సు, ఆహార పదార్థాల నాణ్యత వంటి అంశాలపై మాత్రమే తనిఖీ చేసే అధికారముంది. కానీ సంబంధం లేని లైసెన్సులు అడుగుతుండడంతో పలువురు వ్యాపారులు వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదో విధంగా వ్యాపారులను బెదిరింపులకు గురి చేసి వారి నుంచి డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తున్నారు.

గూగుల్‌ పే చేయాలని డిమాండ్‌

తనిఖీలు, నోటీసుల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గూగుల్‌ పేకు రూ.20 వేలు పంపించాలని సదరు నకిలీ అధికారి డిమాండ్‌ చేస్తున్నారు. పలువురు వ్యాపారులు మాత్రం వారిని ఫుడ్‌ సేఫ్టీ అధికారిగా నమ్మి వారు ఇచ్చిన గూగుల్‌ పే నెంబర్‌కు డబ్బులు పంపించినట్లు తెలుస్తోంది. ఇలా పదుల సంఖ్యలో వ్యాపారుల నుంచి భారీగా వసూలు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ విషయం మాత్రం పలువురు వ్యాపారులు ఫుడ్‌ సెఫ్టీ డిపార్ట్‌మెంట్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గుర్తు తెలియన వ్యక్తుల నుంచి ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని, ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని వారు వ్యాపారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement