వారిద్దరే భాగస్వాములంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అధికారాన్ని శాశ్వతంగా తమ గుప్పిట్లో ఉంచుకోవాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పేదలు, దళితులు, ఆదివాసులు, గిరిజనులు, మైనారిటీలు, యువత ఓట్లను లక్ష్యంగా చేసుకుని వారి ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.
దేశంలో ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించారని, దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు స్వాతంత్య్రం కోసం ‘సైమన్ గో బ్యాక్’ఉద్యమం సాగిందని, ఇప్పుడు ఓటు హక్కును కాపాడుకునేందుకు ‘జ్ఞానేశ్ గో బ్యాక్’, ‘ఎస్‌ఐఆర్ గో బ్యాక్’ నినాదాలతో ఉద్యమించాల్సిన అవసరం వచ్చిందని పిలుపునిచ్చారు. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ఆందోళనలో భాగంగా ఢిల్లీ తెలంగాణ భవన్‌లో సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో సీఎం సమావేశమయ్యారు. రాహుల్ బస్సు యాత్రకు ముందుగా నిర్వహించిన సమావేశంలో రేవంత్ ప్రసంగించారు.
బీజేపీ గెలుపు కోసమే దుర్వినియోగం
ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా.. అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ గెలుపు కోసం ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేశారని, ఇది బయటపడుతుందనే భయంతో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను కాపాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకుని, రాజకీయ ప్రత్యర్థుల ఓటు బలాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందన్నారు. బిహార్, పశి్చమ బెంగాల్, హరియణా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణలు, ఎన్నికల పరిణామాలను ప్రస్తావిస్తూ.. బీజేపీకి లబ్ధి చేకూరేలా వ్యవస్థను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా, ఆయనపై చర్యలు తీసుకునేందుకు మోదీ, అమిత్ షా ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
20 కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు..
2014లో మోదీ తొలిసారి ప్రధానమంత్రి పదవికి పోటీ చేసిన సమయంలో దేశంలో సుమారు 81 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 2019లో ఈ సంఖ్య 91 కోట్లకు, 2024 ఎన్నికల నాటికి 97 కోట్లకు చేరిందని రేవంత్‌రెడ్డి వివరించారు. అయితే 2026లోకి వచ్చేసరికి 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఈ తొలగించే ఓట్ల సంఖ్యను 20 కోట్లకు పెంచే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుతున్నప్పుడు ఓటర్ల సంఖ్య తగ్గడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని కోరారు.
రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను రెండు వర్గాలుగా విభజించే పరిస్థితిని సృష్టిస్తోందని సీఎం విమర్శించారు. ఒకవైపు అధికార పారీ్టకి అనుకూలంగా ఉన్న సంపన్నులకు రాజకీయ ప్రాధాన్యం లభిస్తుండగా, మరోవైపు పేదలు, దళితులు, ఆదివాసులు, గిరిజనులు, మైనారిటీల ఓటు హక్కుకే ముప్పు ఏర్పడుతోందని ఆరోపించారు. ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వ పథకాలు, రేషన్ వంటి ప్రయోజనాల విషయంలోనూ పేదలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పేదల పక్షాన కాంగ్రెస్ పోరాటం
ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ దేశ ప్రజల దృష్టికి తెచి్చన నాయకుడు రాహుల్ గాంధీ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పోరాటం చేస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం స్వాతంత్య్ర ఉద్యమం తరహా పోరాటం అవసరమైందంటూ వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాల సవరణలపై ఉన్న అభ్యంతరాలను పరిష్కరించకుండా, నిరసనలను అణచివేసే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
గతంలో ఎన్నికల సంఘం ఒక్క కమిషనర్ నేతృత్వంలో పనిచేసేదని, అయితే, ఈ సంస్థలో మరింత పారదర్శకత తెచ్చేందుకు పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ముగ్గురు కమిషనర్ల విధానాన్ని తెచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో ఎన్నికల కమిషనర్ల నియామకంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించే సమయంలోనే రాహుల్‌గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తుచేశారు.
ఓటు హక్కు కల్పించేందుకు ఎస్‌ఐఆర్
1950లో నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో, తర్వాత ఇందిరాగాంధీ, వాజ్‌పేయి ప్రభుత్వాల కాలంలోనూ సర్ ప్రక్రియ జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అయితే, గతంలో ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన వారిని చేర్చడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టేవారన్నారు. ఇప్పుడు మోదీ, అమిత్ షాల పాలనలో మాత్రం ఇప్పటికే ఓటు హక్కు ఉన్నవారి పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. తమ అధికారానికి అడ్డుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ, నార్కోటిక్స్ విభాగం వంటి సంస్థలను ఉపయోగించుకుందని, ఇప్పుడు వాటితో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం కష్టమవుతోందనే ఉద్దేశంతో ఎస్‌ఐఆర్‌ను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.
బీజేపీ గెలిచేలా ఈసీ అక్రమాలు: భట్టి
ఎస్‌ఐఆర్ పేరుతో బీజేపీ మాత్రమే గెలిచేలా ఎన్నికల కమిషన్ ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశ పౌరుల ఓటు హక్కును పరిరక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తోందన్నారు. ఢిల్లీలో నిర్వహించిన సత్యాగ్రహంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రాథమిక హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటు హక్కుకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ కొంతకాలంగా దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఓటర్ల హక్కుల అంశాన్ని రాష్ట్రపతితోపాటు వివిధ రాజ్యాంగ సంస్థల దృష్టికి గతంలోనూ తీసుకెళ్లామని భట్టి తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గాంధేయ మార్గంలో శాంతియుతంగా సత్యాగ్రహం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
దేశవ్యాప్త ఉద్యమం: మహేశ్ గౌడ్
ప్రధాని మోదీ, కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఓట్ల చోరీపై తమ ఉద్యమం ఆగదని చెప్పారు. ఓట్ల చోరీ ద్వారానే దేశంలో గెలవాలని బీజేపీ ప్రయతి్నస్తోందని, ఇందుకు ఈసీ మద్దతుగా ఉంటోందని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయని, ఈ అంశంపై సుప్రీంకోర్టు తమ వాదనలను వినాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరారు.
అందరూ ఢిల్లీలోనే ఉండండి
‘ఓట్ బచావో’ ఉద్యమం కోసం ఢిల్లీ వచి్చన నేతలు మళ్లీ చెప్పే వరకూ ఢిల్లీ విడిచి వెళ్లొద్దని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ ఉద్యమం ఒక్కరోజుతో అయ్యేది కాదన్నారు. రాహుల్ గాంధీ ఎన్నిరోజులని చెబుతారో తెలియదని, కాబట్టి రిటర్న్ టికెట్స్ ఎవరూ బుక్ చేసుకోవద్దని సూచించారు. ఢిల్లీకి వచి్చన నేతలు అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి వారందరికీ సాయం చేసేందుకు హెల్ప్ డెస్క్ అవసరం అన్నారు. అరెస్టయిన వారిని విడిపించేందుకు ఎవరి స్థాయిలో వాళ్లు పని చేయాలని చెప్పారు. అరెస్ట్ చేసిన మనవాళ్లను ఢిల్లీ, పక్కరాష్ట్రాలకు తరలించే అవకాశాలు ఉన్నాయని, వారందరికీ ధైర్యం కల్పించేందుకు హెల్ప్ డెస్క్ అవసరం అన్నారు. ఇది 24 గంటలూ పని చేసేలా ఉండాలని ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్‌రెడ్దిలను రేవంత్ ఆదేశించారు.
విచారణకు సిద్ధమా: పొన్నం
ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైతే తామే సిస్టమ్‌లో చేరి్పస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సంఘం అధికారాలను తమ జేబు సంస్థగా భావించి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఏసీ గదుల్లో కూర్చొని సవాళ్లు విసరడం కాదని, ఏయే బూత్‌లు, వార్డుల్లో ఓట్లు తొలగించబడ్డాయో విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఓట్ల తొలగింపు పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన జగన్ ఓడిపోవడమేంటి?


