
డయాబెటిస్ వైద్యసేవలపై సదస్సు
పాల్గొన్న ఆలివ్ సర్వోదయ హాస్పిటల్ వైద్యులు
హైదరాబాద్: మధుమేహం ప్రభావం శారీరకమైందే కాకుండా మానసికంగానూ ఉంటుందని హైదరాబాద్‌లోని ఆలివ్ సర్వోదయ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మధుమేహం - మానసిక ఆరోగ్యాల మధ్య సంబంధాలపై ఏర్పాటు చేసిన ఒక సదస్సులో వైద్యులు ఈ అంశంపై చర్చించారు. కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ వికాసుద్దీన్ సారథ్యంలో జరిగిన ఈ సదస్సులో పలువురు వైద్యులు తమ క్లినికల్ అనుభవాలను పంచుకున్నారు. మధుమేహ రోగుల సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ వికాసుద్దీన్ మాట్లాడుతూ..
కేవలం రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిచండం, మందులను సక్రమంగా వేసుకోవడంతోనే మధుమేహ నియంత్రణ ఆగిపోదని, మధుమేహ రోగులో ఓ అదృశ్య భారానికి లోనవుతూంటారని అన్నారు. డాక్టర్ల వద్దకు వచ్చే ముందు వారు చెప్పుకోలేని ఆందోళనకు గురవుతూంటారని, మధుమేహాన్ని నిత్యం పర్యవేక్షిస్తూండాల్సిన అవసరంతో ఒత్తిడికి గురై ఉంటారని, ఫలితంగా చాలామంది రోగులు డిప్రెషన్‌కు లోనై ఉంటారని, సామాజిక ఒత్తిళ్ల పుణ్యమా వీరి జీవితం తాలూకూ నాణ్యతపై ప్రభావం పడి ఉంటుందని వివరించారు. శారీరక లక్షణాలకు చికిత్స తీసుకున్న విధంగానే మధుమేహ రోగులు మానసిక సమస్యల పరిష్కారానికీ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అప్పుడే వారి దైనందిన జీవితం మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని అనానరు.
100 మిలియన్లకు పైబడి...
ఇరవై ఏళ్ల క్రితం దేశంలో మధుమేహం జీవనశలి సంబంధిత జీవక్రియల వ్యాధి అనుకునేవారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అంచనాల ప్రకారం, 1995లో భారతదేశంలో మధుమేహుల సంఖ్య 2.6 కోట్ల మంది మధుమేహులు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య పది కోట్లకు మించిపోయింది. ICMR–INDIAB, 2023 అధ్యయనం ప్రకారం, ప్రతి నలుగురు డయాబెటిస్ రోగులలో ఒకరు ఆందోళన లేదా డిప్రెషన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో మధుమేహం, మానసిక ఆరోగ్యాల మధ్య ఉన్న సంబంధాని విస్మరించలేమని, పట్టణీకరణ, అధిక పని సమయం, శారీరక శ్రమ తగ్గిపోతూండటం, ఒంటరితనం వంటివి సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వైద్య నిపుణులు వివరించారు. ఆధునిక వైద్యంలో డయాబెటిస్ సంరక్షణ, మానసిక ఆరోగ్య నిపుణులు, కుటుంబం పాత్ర, ఆరోగ్య సంరక్షకుల సమన్వయం కూడా అవసరమని డాక్టర్ వికాసుదీన్ స్పష్టం చేశారు.