సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో రద్దీ ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRT) వ్యవస్థ ఏర్పాటుపై సమీక్షించారు. మెట్రో, ఎంఎంటీఎస్, బస్ స్టేషన్లను అనుసంధానించేలా పీఆర్‌టీ వ్యవస్థకు రూపకల్పన చేయాలని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్‌టీ వ్యవస్థలను అధ్యయనం చేసి నివేదిక అందించాలని ఆదేశించారు.
అలాగే, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానం అమలు ద్వారా వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ముంబై తరహాలో ఏడాదిలోపే నిర్మాణ పనులు పూర్తి చేసే సాంకేతిక పరిజ్ఞానంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌కు సమాంతరంగా రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
అదేవిధంగా రీసైకిల్డ్ నీటి వినియోగాన్ని పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రోజుకు 500 ఎంఎల్‌డీ రీసైకిల్డ్ వాటర్‌ను వినియోగంలోకి తీసుకొచ్చే అంశంపై దృష్టి సారించాలని, అలాగే, ఫ్యూచర్ సిటీ, డేటా సెంటర్ల అవసరాలకు ఈ నీటిని వినియోగించేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.
హైరైజ్ భవనాలు, పార్కుల్లోనూ రీసైకిల్డ్ వాటర్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో ప్రజా రవాణా, రహదారుల అభివృద్ధి, నీటి నిర్వహణకు సంబంధించి సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు.
ఇదీ చదవండి: ఇప్పటికైనా నిద్రలేవడం సంతోషం.. కేటీఆర్ సెటైర్లు


