రవీంద్ర జడేజా (PC: BCCI/X)
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌కు సంబంధించి సౌరాష్ట్ర తమ జట్టును ప్రకటించింది. వెటరన్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కట్‌ను మరోసారి కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇక సౌరాష్ట్ర జట్టులో టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా చోటు దక్కింది.
గ్రూప్ దశకే పరిమితం
కాగా రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా సౌరాష్ట్ర తమ తొలి మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ జట్టుతో తలపడనుంది. అక్టోబరు 11న ఈ మ్యాచ్ మొదలుకానుంది. గత వైఫల్యాలను అధిగమించి ఈసారి మెరుగ్గా రాణించాలని పట్టుదలతో ఉన్న సౌరాష్ట్రకు జడ్డూ రాక సానుకూల అంశంగా పరిణమించింది. గత సీజన్లో సౌరాష్ట్ర గ్రూప్ దశకే పరిమితమైంది.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు
ఇదిలా ఉంటే.. 2019-20, 2022-23 సీజన్లలో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీలు గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు సందర్భాల్లోనూ ఉనాద్కటే కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఇక రంజీ ట్రోఫీ ఆడటం ద్వారా జడ్డూకు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు మంచి ప్రాక్టీస్ లభించనుంది.
కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో నవంబరు 19- డిసెంబరు 1 మధ్య రెండు మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఇక జడ్డూ చివరగా ఇటీవల వెస్టిండీస్‌తో స్వదేశంలో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు.
కొత్తగా ఇద్దరు
ఇదిలా ఉంటే.. గత రంజీ సీజన్‌లో సౌరాష్ట్ర తరఫున మూడు ఇన్నింగ్స్ ఆడిన జడ్డూ మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఇక సౌరాష్ట్ర జట్టు విషయానికొస్తే.. గత సీజన్లో ఆడిన 14 మంది ఆటగాళ్లు ఈసారి కూడా రంజీ జట్టులో చోటు పదిలం చేసుకున్నారు. కొత్తగా పేసర్ నీల్ పాండ్యా, ఆల్‌రౌండర్ అర్థ్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
కాగా సౌరాష్ట్ర జట్టు రంజీ 2026-27 సీజన్లో ఎలైట్ గ్రూప్-‘బి’లో భాగంగా ఆంధ్ర, అసోం, ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, కర్ణాటక, పంజాబ్, త్రిపుర జట్లతో పోటీపడనుంది.
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌కు సౌరాష్ట్ర జట్టు
జయదేవ్ ఉనాద్కట్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), అర్పిత్ వసవాడ, చిరాగ్ జనీ, ప్రేరక్ మన్కడ్, జై గోహిల్, చేతన్ సకారియా, అంకుర్ పన్వార్, సమర్ గజ్జార్, పార్థ్ భూట్, విశ్వరాజ్ సిన్హ జడేజా, హేత్విక్ కొటక్, నీల్ పాండ్యా, అర్థ్ యాదవ్, తరంగ్ గోహెల్.
చదవండి: సెలక్టర్లతో మాట్లాడాను.. టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమే


