IPL 2022: సెంచరీ మిస్‌.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు!

IPL 2022: Faf And Hazlewood Shine RCB Beat LSG By 18 Runs - Sakshi

 బెంగళూరు జోష్‌

IPL 2022 RCB Vs LSG- ముంబై: కొత్త కెప్టెన్‌ నేతృత్వంలో ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ (ఆర్‌సీబీ) ఆట ప్రతీ మ్యాచ్‌కూ పదునెక్కుతోంది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్‌సీబీ ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 18 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించింది.

ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (64 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించాడు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కృనాల్‌ పాండ్యా (28 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. జోష్‌ హాజల్‌వుడ్‌ (4/25) లక్నోను దెబ్బ తీశాడు.  

సెంచరీ మిస్‌... 
బెంగళూరు ఇన్నింగ్స్‌ పేలవంగా ప్రారంభమైంది. చమీరా వేసిన తొలి ఓవర్‌ ఐదో బంతికి అనూజ్‌ రావత్‌ (4) అవుట్‌ కాగా, తర్వాతి బంతికే విరాట్‌ కోహ్లి (0) వెనుదిరిగాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌ (11 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. చమీరా ఓవర్లో అతను వరుస బంతుల్లో 4, 4, 6 బాదగా ఆ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి.

అయితే హోల్డర్‌ అద్భుత క్యాచ్‌తో మ్యాక్సీ ఇన్నింగ్స్‌ ముగియగా, సుయాశ్‌ (10) విఫలమయ్యాడు. ఈ దశలో డుప్లెసిస్‌ జట్టును ఆదుకున్నాడు. అతడికి షహబాజ్‌ అహ్మద్‌ (22 బంతుల్లో 26; 1 ఫోర్‌) నుంచి తగిన సహకారం లభించింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 48 బంతుల్లో 70 పరుగులు జోడించారు.

షహబాజ్‌ రనౌటైన తర్వాత మరింత జోరుగా ఆడిన డుప్లెసిస్‌ ... బిష్ణోయ్‌ ఓవర్లో 14 పరుగులు రాబట్టి 90ల్లోకి చేరుకున్నాడు. అయితే 20వ ఓవర్‌ ఐదో బంతికి భారీ షాట్‌ ఆడే క్రమంలో అవుట్‌ కావడంతో అతని సెంచరీ చేజారింది.  

సమష్టి వైఫల్యం... 
ఛేదనలో లక్నో తడబడింది. డికాక్‌ (3), మనీశ్‌ పాండే (6) విఫలం కాగా, రాహుల్‌ను హర్షల్‌ అవుట్‌ చేశాడు. కీపర్‌ క్యాచ్‌ను అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించగా... రివ్యూలో ఫలితం ఆర్‌సీబీకి అనుకూలంగా వచ్చింది. ఆ తర్వాత కృనాల్‌ ధాటిగా ఆడటంతో లక్నో పోటీలో నిలిచింది.

అయితే ఎనిమిది పరుగుల వ్యవధిలో హుడా (13), కృనాల్‌ వెనుదిరిగారు. చివర్లో స్టొయినిస్‌ (15 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌), హోల్డర్‌ (16) కొన్ని పరుగులు సాధించినా... అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. 38 బంతుల్లో 74 పరుగులు చేయాల్సిన స్థితిలో వచ్చిన స్టొయినిస్‌కు జట్టును గెలిపించడం శక్తికి మించి భారంగా మారింది. 

చదవండి: Faf Du Plesis: ఆర్‌సీబీ కెప్టెన్‌కు సెంచరీ యోగ్యం లేదా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top