సుతార్‌పై వేటు కంబోజ్‌కు చోటు | Indian ODI and Test squads announced for series against New Zealand | Sakshi
Sakshi News home page

సుతార్‌పై వేటు కంబోజ్‌కు చోటు

Oct 17 2026 4:10 AM | Updated on Oct 17 2026 4:10 AM

Indian ODI and Test squads announced for series against New Zealand

వన్డేల నుంచి జైస్వాల్‌ అవుట్‌

షమీకి మళ్లీ నిరాశ 

న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు భారత వన్డే, టెస్టు జట్ల ప్రకటన  

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల కోసం భారత జట్లను సెలక్టర్లు శుక్రవారం ప్రకటించారు. టెస్టు టీమ్‌తో పాటు తొలి మూడు వన్డేలకు శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యం వహించనుండగా... చివరి 2 వన్డేలకు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. శ్రీలంకతో చివరిసారిగా టెస్టులు ఆడిన భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. రవీంద్ర జడేజాకు సరైన వారసుడంటూ ప్రచారం కల్పించిన లెఫ్టార్మ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మానవ్‌ సుతార్‌పై వేటు వేసి టీమ్‌లో మళ్లీ జడేజాకే చోటు కల్పించారు. సుతార్‌ తాను ఆడిన తొలి 3 టెస్టుల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. 

ఊహించినట్లుగానే సర్ఫరాజ్‌ ఖాన్, సారాంశ్‌ జైన్, ఆకిబ్‌ నబీ టీమ్‌లో చోటు కోల్పోయారు. వీరి స్థానాల్లో ఆల్‌రౌండర్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌ టీమ్‌లోకి ఎంపికయ్యారు. గాయం నుంచి కోలుకున్న సాయి సుదర్శన్‌కు మళ్లీ స్థానం లభించగా... పేసర్లు ఆకాశ్‌దీప్, అన్షుల్‌ కంబోజ్‌ పునరాగమనం చేశారు. ఏడాదిన్నర క్రితం ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడిన ఆకాశ్‌దీప్‌ గాయంతో దూరం కాగా, అదే సిరీస్‌లో ఏకైక టెస్టు ఆడి పేలవ ప్రదర్శనతో కంబోజ్‌ టీమ్‌కు దూరమయ్యాడు. కీపర్‌ రిషభ్‌ పంత్‌ను ఎంపిక చేసినా అతను పూర్తి ఫిట్‌నెస్‌ను సాధిస్తేనే టెస్టు టీమ్‌తో కలుస్తాడు. నవంబర్‌ 4–15 మధ్య భారత్, కివీస్‌ 5 వన్డేల్లో తలపడనుండగా... నవంబర్‌ 19 నుంచి తొలి టెస్టు జరుగుతుంది.  

వన్డేల్లో జడేజాకు దక్కని చోటు... 
ఇటీవల వెస్టిండీస్‌తో ఆడిన వన్డే టీమ్‌లో కీలక మార్పులు జరిగాయి. రవీంద్ర జడేజాతో పాటు అనూహ్యంగా యశస్వి జైస్వాల్‌ కూడా స్థానం కోల్పోయాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జడేజా ను పక్కన పెట్టారని భావిస్తుండగా... గత 3 వన్డేల్లో 2 సెంచరీలు చేసినా జైస్వాల్‌కు చాన్స్‌ లభించలేదు. నబీ తన స్థానం నిలబెట్టుకోగా, పేసర్‌ యశ్‌ ఠాకూర్‌కు తొలిసారి వన్డే పిలుపు లభించింది. జార్ఖండ్‌ వికెట్‌ కీపర్‌ కుమార్‌ కుషాగ్ర మొదటిసారి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. మరోవైపు సీనియర్‌ పేసర్‌ షమీ అంతర్జాతీయ కెరీర్‌ ఇక ముగిసినట్లే! పేస్, స్వింగ్‌కు అనుకూలించే కివీస్‌ పిచ్‌లపై స్థానం లేదంటే మున్ముందు అతడికి ఎలాంటి అవకాశం ఉండదు. వన్డేల్లో కూడా అతను పేరును పరిశీలించలేదంటే 2027 వరల్డ్‌ కప్‌ ప్రణాళికల్లో షమీ లేనట్లే.

తొలి 3 వన్డేలకు జట్టు: గిల్‌ (కెప్టెన్‌), శ్రేయస్‌ (వైస్‌ కెప్టెన్‌), రోహిత్, కోహ్లి, రాహుల్, నితీశ్‌ రెడ్డి, అక్షర్, నమన్‌ ధీర్, కంబోజ్, గుర్నూర్‌ బ్రార్, రుతురాజ్‌ గైక్వాడ్, అర్ష్ దీప్ సింగ్, ఇషాన్‌ కిషన్, సిరాజ్, కుల్దీప్, ప్రసిధ్‌ కృష్ణ (ఫిట్‌నెస్‌ సాధిస్తేనే). 

చివరి 2 వన్డేలకు జట్టు: శ్రేయస్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వైస్‌ కెప్టెన్‌), రోహిత్, కోహ్లి, తిలక్, నితీశ్‌ రెడ్డి, అక్షర్, నమన్, నబీ, గుర్నూర్, రుతురాజ్, అర్ష్ దీప్, కుమార్‌ కుషాగ్ర, సిరాజ్, కుల్దీప్, యశ్‌ ఠాకూర్‌. 

టెస్టు జట్టు: గిల్‌ (కెప్టెన్‌), రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), జైస్వాల్, పడిక్కల్, పంత్‌ (ఫిట్‌నెస్‌ సాధిస్తేనే), జురేల్, జడేజా, కంబోజ్, బుమ్రా, ప్రసిధ్, ఆకాశ్‌దీప్, సుదర్శన్, నితీశ్‌ రెడ్డి, సుందర్, కుల్దీప్, సిరాజ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement