కివీస్‌పై ఆసీస్‌ ఘన విజయం: ఆర్సీబీ ఫ్యాన్స్‌ హర్షం!

Australia Won 3rd T20 Against New zealand RCB Fans Cant Keep Calm - Sakshi

వెల్లింగ్‌టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ దుమ్ములేపాడు. 31 బంతుల్లో 70 పరుగులు చేసి సత్తా చాటాడు. కాగా  ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేపథ్యంలో ఆసీస్‌ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం నాటి మూడో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్‌, పర్యాటక జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌(69), మాక్స్‌వెల్‌(70), ఫిలిప్‌(43) మినహా మిగిలిన ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 208 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లలో సౌథీ, బౌల్ట్‌ చెరో వికెట్‌ తీయగా, సోధి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇక 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 17.1 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆష్టన్‌ అగర్‌ ఆరు వికెట్లతో చెలరేగగా, మెరెడిత్‌ రెండు, ఆడం జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ చెరో వికెట్‌ తీశారు. ఇక గత రెండు మ్యాచ్‌లు ఆతిథ్య కివీస్‌ జట్టు గెలిచిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో ఆసీస్‌కు ఊరట దక్కింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ 2-1తో సిరీస్‌లో ముందంజలో ఉంది. కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2021 మినీ వేలంలో భాగంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన అతడిని రూ. 14.25 కోట్లు వెచ్చించి భారీ ధరకు కొనుగోలు చేసింది. 

ఈ నేపథ్యంలో తాజా మ్యాచ్‌లో మాక్సీ ప్రదర్శనను కొనియాడుతూ ఆర్సీబీ ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించింది. స్టన్నింగ్‌ పర్ఫామెన్స్‌తో చెలరేగిపోయి, ఆస్ట్రేలియా 208 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడంటూ కొనియాడింది. ఈ క్రమంలో ఆర్సీబీ అభిమానులు.. ‘‘ఎవరన్నారు ఆర్సీబీ ఎవడొచ్చినా ఆడలేదని.. ఈ యాక్షన్‌ ప్యాక్‌ మెరుపులు చూశారా? ఈసారి కప్‌ మనదే. ఆర్సీబీ ట్రోలర్స్‌కు‌ రెండు నిమిషాల పాటు మౌనం పాటించండి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(రూ. 14.25 కోట్లు), న్యూజిలాండ్‌ బౌలర్‌ కైల్‌ జేమిసన్‌(రూ. 15 కోట్లు)తో పాటు డేనియల్‌ క్రిస్టియన్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌తో పాటు కెఎస్‌ భరత్‌, సచిన్‌ బేబి, రజత్‌ పాటిధార్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌, సుయేశ్‌ ప్రభుదేశాయ్‌ వంటి స్వదేశీ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉంటే.. కివీస్‌ ఆటగాడు జిమ్మీ నీషమ్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అంతేకాదు బ్యాటింగ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ముంబై ఇండియన్స్‌- ఆర్సీబీ ఫ్యాన్స్‌ మధ్య సోషల్‌ మీడియా వార్‌కు తెరతీసింది. మాక్సీ రెచ్చిపోయిన చోట నీషమ్‌ చతికిలబడ్డాడంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇందుకు ఎంఐ అభిమానులు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. ఏదేమైనా కివీస్‌- ఆసీస్‌ మ్యాచ్‌పై దృష్టి సారించిన ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: 'రూట్‌ భయ్యా.. ఈసారి పిచ్‌ ఎలా ఉంటుందంటావు!'

IPL Auction: క్రిస్‌ మోరిస్‌ కొత్త రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top