గడప దాటని అమాత్యులు! | Sakshi
Sakshi News home page

గడప దాటని అమాత్యులు!

Published Sat, Nov 25 2023 4:42 AM

- - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఒకప్పుడు మంత్రులదే హవా.. పాలనా పరమైన అంశాల్లోనే కాదు ఎన్నికల సమయంలోనూ కీలకంగా వ్యవహరించేవారు. తమ విజయంతో పాటు పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను సైతం భుజాన వేసుకుని ప్రచారం సాగించేవారు. ప్రస్తుతం జిల్లాలో ఆ పరిస్థితి కన్పించడం లేదు. ఇంటి గడప దాటి బయట అడుగు పెట్టిన దాఖలాలు లేవు. చిన్న చిన్న ర్యాలీలు మొదలు రోడ్‌షోలు, బహిరంగ సభలు.. ఇలా ప్రతిదానికీ పార్టీ అధినేతపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో విద్యాశాఖమంత్రి సబితారెడ్డి మహేశ్వరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, కార్మికశాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి మేడ్చల్‌ జిల్లా నుంచి, పట్నం మహేందర్‌రెడ్డి వికారాబాద్‌ నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో స్టార్‌ క్యాంపెయినర్లుగా వ్యవహరించాల్సిన వీరంతా ప్రస్తుతం సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో వారు తమ గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాల్సివస్తోంది. చివరికి వీరు కూడా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వైపే చూడాల్సి వస్తోంది. చేవెళ్ల, వికారాబాద్‌, తాండూరు, పరిగి అభ్యర్థుల తరపున స్టార్‌ క్యాంపెయినర్‌గా పని చేయాల్సిన మంత్రి మహేందర్‌రెడ్డి కొడంగల్‌లో తన సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి తరపున మాత్రమే ప్రచారం సాగిస్తున్నారు.

జిల్లా అధ్యక్షులదీ అదే పరిస్థితి

బీఆర్‌ఎస్‌ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో నిలిచారు.. జిల్లా అధ్యక్షుడిగా ఇతర నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయాల్సిన ఆయన ప్రస్తుతం పూర్తిగా సొంత నియోజకవర్గానికే పరిమితమ య్యారు. వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌ వికారాబాద్‌ సరిహద్దులు దాటి బయటికి రావడం లేదు. మేడ్చల్‌ జిల్లా అధ్య క్షుడు శంభీపూర్‌రాజుకు మల్కాజ్‌గిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఆయన కూడా ఆ నియోజకవర్గం దాటి బయటికి వెళ్లడం లేదు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రచారానికి వచ్చినప్పుడు మినహా ఇతర సందర్భాల్లో జనంలో పెద్దగా కన్పించడం లేదు.

మాది మాకే అయితలేదు..

మీ తానికెప్పుడు రావాలె..

సొంత చరిష్మానే నమ్ముకున్న అభ్యర్థులు

ఇక చేవెళ్ల ఎంపీగా కొనసాగుతున్న రంజిత్‌రెడ్డి కేవలం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌,హరీశ్‌రావు వంటి ముఖ్యనేతలు జిల్లాకు వచ్చిన సమయంలోనే ఆయా వేదికలపై కన్పిస్తున్నారు. ఆ తర్వాత ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల తరపు ప్రచారం చేస్తున్న దాఖలాలు మచ్చుకు కూడా కన్పిండం లేదు. ఎమ్మెల్సీలు యెగ్గే మల్లేశం, సురభివాణిదేవి, బి.దయానంద్‌ సహా నామినేటెడ్‌ పోస్టులు పొందిన వారు సైతం ప్రచారంలో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు పార్టీ పథకాలు, అగ్రనేతల సభలు, సొంత చరిష్మానే నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు.

సొంత నియోజకవర్గాలకేపరిమితమైన మంత్రులు

పార్టీ జిల్లా అధ్యక్షులదీ అదే వరుస

కేసీఆర్‌, కేటీఆర్‌ సభలు, రోడ్డు షోలపైనే ఆశలు

ఉమ్మడి జిల్లాలో స్టార్‌ క్యాంపెయినర్లు కరువు

ప్రభుత్వ పథకాలు, సొంత ప్లానింగ్‌తోనే అధికారపార్టీ అభ్యర్థుల ప్రచారం

Advertisement
Advertisement