పార్లమెంట్‌ను కుదిపేసిన పెగసస్‌

Uproar over Pegasus continues in Parliament, two Bills passed in Lok Sabha - Sakshi

వెల్‌లో విపక్ష సభ్యుల నిరసన

సభాకార్యక్రమాలకు అంతరాయం

పలుమార్లు వాయిదాపడ్డ ఉభయసభలు

ప్రతిపక్షాల తీరుపై వెంకయ్య అసహనం

న్యూఢిల్లీ: పెగసస్‌ దుమారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌పై నిగ్గు తేల్చాలంటూ ప్రతిపక్షాలు ఉభయసభలను అడ్డుకున్నాయి. దీంతో పలుమార్లు సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం సభ ఆరంభమైన వెంటనే సభ్యులు కార్గిల్‌ యుద్ధవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మీరాబాయి చానును అభినందించారు. వెంటనే రాజ్యసభలో కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకుపోయారు.

రూల్‌ 267 కింద విపక్ష నేతలు మల్లిఖార్జున్‌ ఖర్గే, వేణుగోపాల్, తిరుచ్చి శివ, సుకేందు శేఖర్‌ రాయ్, ఎలమారమ్‌ కరీన్‌ తదితరులు ఇచ్చిన నోటీసులను అనుమతించేది లేదని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య చెప్పారు. సభ్యులు కోరుకునే అంశాలపై చర్చ సభా సాధారణ సమయంలో చేయవచ్చన్నారు. రోజూవారీ కార్యకలాపాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చించేందుకు రూల్‌ 267 కింద నోటీసులు ఇస్తారు. విపక్ష సభ్యులు ప్రజాసంబంధమైన అంశాలను చర్చించకుండా అడ్డుకుంటున్నారంటూ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. కరోనా టీకాలు, నిరుద్యోగిత, విద్యాసమస్యలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు, దక్షిణాఫ్రికాలో భారతీయులపై దాడులు, పత్రికా స్వేచ్ఛ, కావేరీ జలాల పంపిణీ వంటి పలు అంశాలు చర్చకు రాకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్నారు. సభ ఐదుమార్లు వాయిదా పడింది.  

సాయంత్రమైనా సాగని సభ
రాజ్యసభ సాయంత్రం సమావేశమైన తర్వాత వెల్‌లో నిరసన తెలుపుతున్న విపక్ష సభ్యులు తమ తమ సీట్లకు వెళ్లారు. నావిగేషన్‌ బిల్లుపై చర్చ ఆరంభం కాగానే తిరిగి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. రూల్‌ 267 కింద చర్చకు అనుమతించాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. పెగసస్‌ విషయమై ఐటీ మంత్రి ఇప్పటికే సమాధానమిచ్చారని మరో మంత్రి అబ్బాస్‌ నఖ్వీ గుర్తు చేశారు. ప్రభుత్వం సభా కార్యకలాపాలు సాగేందుకు వీలుగా సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆర్‌జేడీ విమర్శించింది. అయితే విపక్ష నేతలను తాము సంప్రదించామని, కానీ వారిలో వారికే ఏకాభిప్రాయం రాలేదని లీడర్‌ ఆఫ్‌ హౌస్‌ పీయూష్‌ గోయల్‌ తెలిపారు. సభా నియమాల ప్రకారం ప్రధాని, విపక్ష నేత ప్రసంగించే సమయంలో ఎవరూ అడ్డుకోకూడదని, కానీ విపక్ష నేత ఖర్గే ప్రసంగాన్ని ఒకమంత్రి అడ్డుకున్నారని డీఎంకే విమర్శించింది. ఈ వాదోపవాదాల మధ్య సభ మంగళవారానికి వాయిదా పడింది.  

లోక్‌సభలో అదే ధోరణి
రాజ్యసభలో కార్గిల్‌ వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం  పెగసస్‌పై చర్చించాలని విపక్షాలు సభను అడ్డుకున్నాయి. ప్రధాని వచ్చి సభకు సమాధానమివ్వాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. మోదీ సర్కార్‌ జవాబ్‌దో(మోదీ ప్రభుత్వమా, సమాధానమివ్వు) అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు రెడీగా ఉందని, అందుకు ముందుగా సభ్యులు తమ సీట్లకు వెళ్లాలని స్పీకర్‌ కోరారు. సభ్యులు వినకపోవడంతో సభ వాయిదా పడింది. అనంతరం సమావేశమవగానే ప్రభుత్వం రెండు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. ఫ్యాక్టరింగ్‌ నియంత్రణ బిల్లు, ఎన్‌ఐఎఫ్‌టీఈఎం బిల్లులను సంబంధిత మంత్రులు సభలో ప్రవేశపెట్టారు.

అయితే వీటిపై చర్చకు విపక్ష సభ్యులు అంగీకరించకుండా వెల్‌లో నిరసనలు కొనసాగించారు. కొందరు రైతు చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యులు చర్చలో పాల్గొనాలని పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రి జోషీ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. లోకసభ స్పీకర్‌ స్థానంలో ఉన్న రమాదేవి సైతం సభాకార్యకలాపాలు కొనసాగించేందుకు సహకరించాలని సభ్యులను కోరారు. అయినా పరిస్థితి మారలేదు. నిరసనలు ఆగకపోవడంతో చర్చలేకుండానే బిల్లులు ఆమోదం పొందినట్లు రమాదేవి ప్రకటించారు. మధ్యాహ్న సమయంలో ఆర్థికమంత్రి దివాలా చట్ట సవరణ బిల్లును సభ ముందుంచారు. దీనిపై చర్చ జరగలేదు. అనంతరం సభ తర్వాతి రోజుకు వాయిదా పడింది.

రెండు బిల్లులకు ఆమోదం
నిరసనల మధ్య లోక్‌సభలో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఫ్యాక్టరింగ్‌ నియంత్రణ సవరణ చట్టం 2020ని ఆర్థిక మంత్రి నిర్మల ప్రవేశపెట్టారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి చేయూతనిచ్చేందుకు ఈ సవరణలు తెచ్చామన్నారు. ఫ్యాక్టరింగ్‌ చట్టానికి తాజా సవరణలు చేశారు. బిల్లుపై స్టాండింగ్‌ కమిటీ సూచనలు సైతం ప్రభుత్వం అంగీకరించిందని నిర్మల చెప్పారు. ఎంఎస్‌ఎంఈ సంస్థలకు మరింత మూలధనం దొరికేందుకు ఈ బిల్లు వీలు కల్పించనుంది.

గతేడాది సెప్టెంబర్‌లో ఈ బిల్లును లోక్‌సభ తొలుత ముందుకు తెచ్చారు. అనంతరం నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఫుడ్‌టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మేనేజ్‌మెంట్‌ బిల్‌ 2021ను సైతం లోక్‌సభ ముందుకు ప్రభుత్వం తెచ్చింది. కొన్ని కీలక ఫుట్‌టెక్నాలజీ సంస్థలను జాతీయంగా కీలక సంస్థలుగా ప్రకటించడంతో పాటు, ఆయా రంగాల్లో ప్రయోగాలకు సంబం« దించిన వివరాలు ఈ బిల్లులో పొందుపరిచారు. రాజ్యసభలో ఈ బిల్లుకు మార్చిలోనే ఆమోదం లభించింది. విపక్షాల నిరసనతో చర్చలేకుండానే రెండు బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి.   

కార్గిల్‌ వీరులకు నివాళి
కార్గిల్‌ వీరులకు పార్లమెంట్‌ ఉభయసభలు ఘనంగా నివాళులు అర్పించాయి. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ 22వ వార్షికోత్సవం సందర్భంగా 1999 కార్గిల్‌ యుద్ధంలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించాయి. ‘‘22 సంవత్సరాల క్రితం ఇదే రోజు మన సాహసిక సైనికులు దేశంలో కొంత భూభాగాన్ని ఆక్రమించిన శత్రుమూకను ఓడించాయి. కార్గిల్‌ హైట్స్‌ను తిరిగి సాధించి దేశానికి గర్వించే విజయాన్ని అందించాయి’’అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో నివాళులు అర్పించారు.

భారత జవానుల సాహసాన్ని, త్యాగాన్ని ఆయన కీర్తించారు. అనంతరం సభ్యులు మౌనంగా నిలబడి వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయ్‌ చానును సభ అభినందించింది. అద్భుత ప్రదర్శనతో చాను వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం కోసం 21 సంవత్సరాల నిరీక్షణకు తెరదించిందని వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. లోక్‌సభ సభ్యులు సైతం కార్గిల్‌ వీరులకు నివాళులు అర్పించడంతో పాటు చానును అభినందించారు.  

రాజ్యసభలో మాట్లాడుతున్న ఖర్గే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top