లేఖ చూపండి.. లేదా  రాజీనామా చేయండి

Telangana: Bandi Sanjay Criticized CM KCR - Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌

ధాన్యాన్ని కొనబోమని కేంద్రం రాసిన లేఖ చూపించాలని డిమాండ్‌

మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఈసీకి ఫిర్యాదుచేస్తాం

వరిపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బండి రైతు దీక్ష

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యాన్ని కొనబోమని కేంద్రం రాసిన లేఖ ఉంటే దానిని బహిర్గతం చేయాలని బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి సీఎం కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. తాము చేపట్టిన రైతు దీక్షకు ఇది ఆరంభం మాత్రమేనని, శుక్రవారం నుంచి కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.

వరి పంట వేయొద్దన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ మూడు గంటలు రైతు దీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు జరిగిన ఈ దీక్షలో పలువురు రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడారు. ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్లు మంత్రి నిరంజన్‌ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

ఉప్పుడు బియ్యం కొనబోమని నెల కిందట కేంద్ర ఆహార శాఖ నుంచి వచ్చిన లేఖను చూపుతూ కేంద్రం మొత్తం వరి ధాన్యాన్నే కొనుగోలు చేయబోదని చెప్పినట్టుగా మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ధాన్యం కొనుగోలు గురించి ప్రశ్నిస్తే టీఆర్‌ఎస్‌ పారాబాయిల్డ్‌రైస్‌ లేఖను విడుదల చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ పిట్టల దొర మాటలు రైతులు నమ్మొద్దని అన్నారు. వరి కాకుండా ఏ పంట పండించాలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రత్యామ్నాయ ప్రణాళిక లేకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. 

సిద్దిపేట కలెక్టర్‌పై న్యాయపోరాటం
కోర్టులు చెప్పినా వరి వేయనివ్వమని కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేసిన సిద్దిపేట జిల్లా కలెక్టర్‌పై న్యాయ పోరాటం కొనసాగిస్తామని బండి సంజయ్‌  చెప్పారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాస్తే.. రైతు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనిపించే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. దళితబంధు అమలు ఇష్టం లేని కేసీఆర్‌ ఇప్పుడు ‘వరి బంద్‌’ పథకాన్నీ అమలు చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

వరి పంట వేయకుంటే లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఎందుకు కట్టారని అని నిలదీశారు. వడ్లు కొనేది కేంద్రమే.. ధాన్యం కొనుగోలు చేసేది కేంద్రమేనని ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ మధ్యవర్తి మాత్రమేనని అన్నారు. రీసైక్లింగ్‌ పేరుతో టీఆర్‌ఎస్‌ పెద్దఎత్తున చేసిన అవినీతి, కుంభకోణాలను త్వరలోనే బయట పెడతామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, డా.విజయ రామారావు, కొల్లి మాధవి, పాల్వాయి రజని కుమారి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top