టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ‘తిరుగు’పాట్లు! | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ‘తిరుగు’పాట్లు!

Published Tue, Apr 30 2024 4:40 AM

TDP, Janasena and BJP Alliance being challenged by rebel candidates

16 చోట్ల పోటీలో రెబల్స్‌..  9 చోట్ల టీడీపీ ఉక్కిరి బిక్కిరి 

ఏడు చోట్ల బీజేపీ, జనసేన తిరుగుబాటుదారులు

సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని తిరుగుబాటు అభ్యర్థులు హడలెత్తి­స్తున్నారు. 16 నియోజకవర్గాల్లో రెబల్స్‌ పోటీ­లో ఉండడంతో కూటమి అభ్యర్థులకు కునుకు కరువైంది. వాస్తవానికి 30కిపైగా నియోజక­వర్గాల్లో ఈ పరిస్థితి నెలకొనగా నయానో భయానో కొందరిని రేసు నుంచి తప్పించారు. 16 నియోజక వర్గాల్లో మాత్రం రెబల్స్‌ కూటమి పార్టీలను ధిక్కరించి తాడో పేడో తేల్చుకోవ­డానికి సిద్ధమయ్యారు. ఇందులో తొమ్మిది చోట్ల టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు ఉండగా.. ఏడు చోట్ల బీజేపీ, జనసేన తిరుగు­బాటు అభ్యర్థులు రంగంలో నిలిచారు. తిరుగుబాటు అభ్యర్థులు కొందరికి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం గమనార్హం. 

రాప్తాడులో రెబల్‌ పోటు 
శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో సాకే రాజేష్‌ కుమార్‌ రెబల్‌గా పోటీలో నిలిచారు. నామి­నేషన్‌ ఉపసంహరించుకోవాలని ఆయన­పై తీవ్ర ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఓట్లకు గండి పడటం ఖాయమనే భయం టీడీపీని కలవరపెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ రెబల్‌ పసుపులేటి సుధాకర్‌ బరిలో ది­గారు. సుధాకర్‌కు గాజు గ్లాసు గుర్తు కేటా­యిం­­చడం టీడీపీకి సంకటంగా మారింది. 

చిత్తూరు జిల్లా సత్యవేడు స్థానాన్ని మొదటి నుంచి కష్టపడిన తనకు కాకుండా ఫిరాయింపు నేత ఆదిమూలానికి ఇవ్వడంతో జేడీ రాజశేఖర్‌ తిరుగుబాటు చేసి బరిలో నిలిచారు. అక్కడ అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఆ నియోజకవర్గంలోనే టీడీపీని మరో రెబల్‌ అభ్యర్థి యాతాటి రమేష్‌బాబు బెంబేలెత్తిస్తు­న్నా­­రు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌­నాథ్‌రెడ్డి ఓటమే ధ్యేయంగా దామోదర్‌నాయుడు పోటీలో ఉన్నారు.

రఘురామ గుండెల్లో రైళ్లు 
అనేక మలుపులు తిరిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి స్థానంలోనూ టీడీపీకి రెబల్‌ బెడద తప్పలేదు. ఇక్కడ రఘురామకృష్ణంరాజుకు పోటీగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోటీలో ఉన్నారు. ఆయన్ను బరిలో నుంచి తప్పించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. 

టీడీపీ ఓటమే లక్ష్యంగా శివరామరాజు మొదటి నుంచి ప్రచారం చేస్తూ ఆ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం సీటును జనసేనకు ఇవ్వడంతో మొడియం శ్రీనివాస్‌ రెబల్‌గా బరిలోకి దిగారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో సీటు దక్కలేదనే అసంతృప్తితో పరమట శ్యామ్‌కుమార్‌ పోటీలో నిలిచారు.

టీడీపీ రెబల్‌ మీసాల గీతకు గాజు గ్లాస్‌ గుర్తు
విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా రేసులో నిలవడంతోపాటు ఆమెకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కూటమి నేతలు కంగు తిన్నారు. తనకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారంటూ మీసాల గీత రెబల్‌గా నామినేషన్‌ వేశారు. 

అశోక్‌గజపతిరాజు కుమార్తె అతిథికి సీటు ఇచ్చి తనను అవమానించారని, ఆమెను ఎలాగైనా ఓడిస్తానని మీసాల గీత శపథం చేశారు. గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ సోమవారం సాయంత్రం నుంచే గుర్తుతో కూడిన కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేయడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. అరకులో టీడీపీ రెబెల్‌గా సివేరి అబ్రహం పోటీలో ఉండడంతో కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు.

బాలయ్యకు పరిపూర్ణానంద ఝలక్‌ 
కూటమి సీటు దక్కకపోవడంతో హిందూపురం నుంచి స్వామి పరిపూర్ణానంద బీజేపీ రెబల్‌గా బరిలో నిలిచారు. చంద్రబాబు పిలిచి మాట్లాడినా ఆయన వెనక్కి తగ్గగకుండా కూటమికి చెమటలు పట్టిస్తున్నారు. ఇక్కడ నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్న నేపథ్యంలో పరిపూర్ణానంద దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎచ్చెర్ల, టెక్కలి, గన్నవరం, మాచర్ల, పోలవరంలోనూ బీజేపీ రెబల్స్‌ పోటీలో ఉన్నారు. పెడన, జగ్గంపేటలో జనసేన సీటు దక్కని నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు.

ఫలించని సీఎం రమేష్‌ పైరవీలు
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పాయకరావుపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగలపూడి అనిత తమ స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించకుండా చేసిన పైరవీలు ఫలించలేదు. సీఎం రమేష్‌ తన పలుకుబడి ఉపయోగించి కేంద్ర పెద్దల ద్వారా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఎన్నికల అధికారులు గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లు కోరిన చోట వారికి కేటాయించారు. 

జనసేన పోటీ చేసిన చోట్ల గాజు గ్లాస్‌ గుర్తును ఆ పార్టీకి కేటాయించాలని, పోటీ చేయని చోట ఫ్రీ సింబల్‌గా ప్రకటించి ఇండిపెండెంట్లకు  కేటాయించవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. పాయకరావుపేట అసెంబ్లీ, అనకాపల్లి ఎంపీ స్థానానికి వడ్లమాని కృష్ణ స్వరూప్‌ దళిత బహుజన పార్టీ తరఫున నామినేషన్‌ వేశారు. 

తనకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించాలని కోరారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిత ఆర్‌వో కార్యాలయానికి చేరుకుని అభ్యంతరం తెలిపినా ఫలితం దక్కలేదు. తాను కోర్టును ఆశ్రయిస్తానని కృష్ణ స్వరూప్‌ స్పష్టం చేయడంతో అధికారులు నిబంధనల ప్రకారం ఆయనకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించారు.   

Advertisement
Advertisement