
భువనేశ్వర్: మెట్రిక్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయ్యిందన్న ఆరోపణలపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు గందరగోళం సృష్టించి సభా కార్యక్రమాలను స్తంభింపజేయడంతో అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభమైన కొద్ది సేపటికే మెట్రిక్యులేషన్ గణితం ప్రశ్న పత్రం లీక్ అయ్యిందని ఆరోపిస్తూ బీజేపీ, కాంగ్రెస్ సభ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరీక్షకు ముందే గణితం ప్రశ్న పత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని, దీనిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి వీరంగం చేశారు. సభలో వాతావరణం గందరగోళంగా మారడంతో సభా కార్యకలాపాలు స్తంభించాయి. ఈ పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో స్పీకర్ బిక్రమ్‌కేశరి అరూఖ్ సభను వాయిదా వేశారు. ప్రశ్నపత్రం లీక్ కావడం లేదా పేపర్ వైరల్ కావడం వంటి ఘటనలు ఏవీ జరగలేదని, అంతా కల్పితమని సభ వెలుపల మీడియాతో మాట్లాడిన పాఠశాలలు, సామూహిక విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్‌దాస్ అభివర్ణించారు. ఈరోజు ప్రశ్న పత్రంలో అచ్చు తప్పు మాత్రం దొర్లిందని తెలిపారు.
మంత్రి రాజీనామా చేయాలి..
విద్యాశాఖ మంత్రి ప్రకటన అబద్ధమని బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష చీఫ్ విప్ మోహన్ మాఝీ ఎదురు దాడి చేశారు. మెట్రిక్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడినందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి సమీర్ దాస్ రాజీనామా చేసి, విద్యాశాఖ మంత్రి హోదా నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు తారాప్రసాద్ బహినీపతి సభ వెలుపల విలేకర్లతో మాట్లాడుతూ, కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రణాళికాబద్ధంగా ప్రశ్నలు విడుదల చేశారని ఆరోపించారు. ఫలితంగా ప్రతిభావంతులు, మేధావంతులైన విద్యార్థుల భవిష్యత్ నాశనమవుతోందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
చర్చకు అవకాశమేదీ?
అసెంబ్లీ పని తీరుపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్‌పీ) నాయకుడు నర్సింగ మిశ్రా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమైన, సున్నితమైన అంశాలపై సభలో చర్చకు నివారించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విపక్ష శాసన సభ్యులు నిరసన వ్యక్తం చేశారనే కారణంతో సభను దీర్ఘకాలం పాటు వాయిదా వేయడం సరికాదని సభ వెలుపల మీడియాతో అన్నారు. సభ నడవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని, జీరో అవర్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు వీలు లేని పరిస్థితులను ప్రభుత్వం ప్రేరేపిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన సున్నితమైన సమస్యలపై చర్చను దాట వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రశ్నలకు సభ్యులు సరైన సమాధానాలు పొందలేకపోతున్నారు. అధికార పార్టీ తీరుతో సభా గౌరవం దిగజారి పోతుందని అసంతృప్తి వ్యక్తంచేశారు.
రూ.104.55 కోట్ల సైబర్ మోసాలు
రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2018నుంచి 2022 ఫిబ్రవరి వరకు సైబర్ మోసాలతో రూ.104.55 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి తుషార్‌కాంతి బెహరా అసెంబ్లీలో వివరాలను ప్రవేశ పెట్టారు. బిజూ జనతాదళ్ సభ్యుడు సౌమ్యరంజన్ పట్నాయక్ అడిగిన ప్రశ్నకు ఐదేళ్ల వ్యవధిలో మొత్తం 6,567 సైబర్ మోసం కేసులు నమోదయ్యాయని రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ నేరాల్లో రూ.1,04,55,53,958లు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. 2021లో అత్యధికంగా రూ.40,39,70,514లు సైబర్ మోసాలు నమోదైనట్లు వివరించారు. 2021 నేరాల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సైబర్ నేరాల రేటు 4.4 నమోదు కాగా.. జాతీయ స్థాయిలో సైబర్ నేరాల రేటు 3.9గా నమోదైనట్లు మంత్రి తెలియజేశారు.
మెట్రిక్ పరీక్షల ప్రశ్న పత్రం లీక్‌పై
అసెంబ్లీలో గందరగోళం
పదే పదే స్పీకర్ పోడియం చుట్టుముట్టిన ప్రతిపక్షాలు
గురువారానికి సభను వాయిదా వేసిన స్పీకర్ అరూఖ్
ఆత్మహత్యలు, సైబర్ నేరాలపై
హోంమంత్రి తుషార్ బెహరా సమాధానం
సగటున 12 ఆత్మహత్యలు..
రాష్ట్రంలో రోజుకు సగటున 12 ఆత్మహత్యలు సంభవిస్తున్నట్లు శాసనసభ సమావేశాల్లో బయటపడింది. గత 7 సంవత్సరాల్లో జరిగిన ఆత్మహత్యల కేసులపై సమగ్ర సమాచారం విశ్లేషణాత్మక వివరాలను సభలో ప్రవేశ పెట్టాలని బీజేపీ చీఫ్ విప్ మోహన్‌మాఝి అడిగిన ప్రశ్నతో ఈ సంచలనాత్మక వివరాలు వెల్లడయ్యాయి. ఆయన ప్రశ్నకు బదులుగా రాష్ట్ర హోంశాఖ సహాయమంత్రి తుషార్‌కాంతి బెహరా సభలో ప్రవేశ పెట్టిన వివరాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఆత్మహత్య ఘటనలపై ఆందోళన కలిగిస్తున్నాయి. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం 2016–2020 మధ్య రాష్ట్రంలో ఆత్మహత్య కారణంగా 22,600 మరణాలు నమోదయ్యాయి. ఏటా 4,500మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ లెక్కన రోజుకు 12 చొప్పున ప్రతి నెలా 380 ఆత్మహత్యలు జరుగుతున్నాయని తేలింది. చీఫ్ విప్ అభ్యర్థన మేరకు విభాగం వద్ద లింగ, వయసు, కార్మిక, ఉపాధి తదితర విశ్లేషణాత్మక సమాచారం లేనట్లు మంత్రి ప్రకటించారు.

స్పీకర్ పోడియం చుట్టుముట్టిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు

సమాధానం వినిపిస్తున్న మంత్రి తుషార్ బెహరా