
పోటీల్లో చిన్నారుల నృత్యాలు
● నేటి నుంచి ఉగాది ఉత్సవాలు
పర్లాకిమిడి: పట్టణంలోని రాంనగర్ హైటెక్ ప్లాజా వద్ద ఈనెల 21, 22 తేదీల్లో ఉగాది వేడుకలు తెలు గు, ఒడియా సంస్కృతుల సమన్వయ వేదికలో జరపనున్నట్లు హైటెక్ సంస్థల చైర్మన్ తిరుపతి పాణిగ్రాహి సోమవారం తెలియజేశారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ముగ్గుల పోటీలు చేపట్టనున్నారు. 22న సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 11గంటల వరకు చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ నటులు బుల్లెట్ భాస్కర్, అప్పారావు బృందం ప్రదర్శనలు, ఇండియన్ ఐడిల్ గాయకులు వైష్ణవి, యాషికా, కశ్యప్, రేణుకుమారి సినీ గానలహరి నిర్వహించనున్నారు. అలాగే ప్రముఖ నటులు సుమన్, బాబూమోహన్ ప్రత్యేక అతిథులుగా హాజ రు కానున్నట్లు వివరించారు.
మహిళలకు పోటీలు..
జయపురం: జయపురం తెలుగు సంస్కృతి సమితి, రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు సహకారంతో నిర్వహించనున్న ఉగాది ఉత్సవాల్లో మహిళలకు వివిధ పోటీలు జరిపారు. మెహందీ, మ్యూజికల్ చైర్, వంటల పోటీలు నిర్వహించారు. 21న లాన్ ప్రాంగణంలో జరుగనున్న తొలి రోజు వేడుకలకు సిత్తరాల సిరపడు గేయ రచయిత బల్లా విజయకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనున్నట్లు నిర్వహకులు తెలిపారు. అలాగే జానపద గాయకులు జానకిరామ్ బృందం రేలరే రేల కార్యక్రమం ఏర్పాటు చేశామని వివరించారు.
నాలుగో రోజుకు పోటీలు..
రాయగడ: స్థానిక తేజస్విని హోటల్ ఎదరుగా ఉన్న మైదానంలో జరుగున్న ఉగాది ఉత్సవ పోటీలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా చిన్నారుల మధ్య డ్యాన్స్ పోటీలు నిర్వహించగా, పట్టణ ప్రముఖులు రాఘవ కుముంధాన్, రవి బాబు అతిథులుగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు మహిళల మధ్య నిర్వహించిన మ్యూజికల్ చైర్ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నెక్కంటి కృష్ణచైతన్య, ఉత్సవ కమిటీ కోశాధికారి ఇప్పిలి సన్యాసిరాజు, పీవీపీ రాము, బాలకృష్ణ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రాయగడ: పోటీలను ప్రారంభిస్తున్న రాఘవ కుముంధాన్

జయపురం: మెహందీ పోటీలో పాల్గొన్న మహిళలు