అందరి నోట.. చద్దన్నంమాట

కుటుంబీకులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పొఖాలొ విందు  - Sakshi

భువనేశ్వర్‌:

వివిధ రకాల ఒడియా వంటకాల్లో పొఖాలొది అగ్రస్థానం. ధనిక, పేద, బడుగు వర్గాల అత్యంత ఇష్టమైన నిత్య ఆహారం. ఈ ప్రత్యేకతతో ఒడియా వంటకంగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. రాష్ట్ర ప్రజల జీవన శైలిలో భాగమై సుస్థిర స్థానం చేజిక్కించుకుంది. ప్రజలకు ఇది సాదాసీదా ఆహారం మాత్రమే కాదు.. ఆహార అలవాట్ల పట్ల ప్రేమ, గౌరవం నిబద్ధతకు స్పష్టమైన రుజువుగా పొఖాలొ నిలుస్తుందని పలువురు ప్రముఖులు కొనియాడారు. సోమవారం పొఖాలొ దివాస్‌ పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఒడియా ప్రజలు ప్రత్యేక విందుతో వేడుకలు నిర్వహించుకున్నారు. సామాన్యుడి నుంచి అగ్రస్థాయి నేతల వరకు వేడుకలు జరుపుకోవడం విశేషం. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మొదలుకొని శాసనసభ సభ్యులు, మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, క్రీడా, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు సైతం పొఖాలొ దిబొసొ పురస్కరించుకుని చద్దన్నం విందుతో శుభాకాంక్షలు తెలిపారు. భువనేశ్వర్‌ లోని సాహిద్‌నగర్‌ దుర్గా మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పొఖాలొ విందులో భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ ప్రముఖులు, కార్యకర్తలు సామూహికంగా పాల్గొన్నారు. శాసనసభ ప్రతిపక్ష నేత జయనారాయణ మిశ్రా, రాష్ట్రశాఖ అధ్యక్షుడు సమీర్‌ మహంతి తదితర ప్రముఖులు పాలుపంచుకున్నారు.

శరీరానికి ఎంతో శక్తి..

పర్లాకిమిడి: వేసవిలో చద్దన్నం తినడం ద్వారా శరీరానికి ఐరన్‌, విటమిన్స్‌, శక్తి లభిస్తుందని పర్లాకిమిడి సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ హన్ను శెఠి అన్నారు. సోమవారం పొఖాలొ దివాస్‌(చద్దన్నం దినోత్సవం) సందర్భంగా పట్టణంలోని యూటెక్‌ కంప్యూటర్‌ కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘటన్‌ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షురాలు తనూజా శత్పథితో కలిసి ఆయన ప్రారంభించారు. పూర్వీకులు చద్దన్నాలు తినడం ద్వారా జీర్ణశక్తి పెరగటమే కాకుండా పొలాల్లో రోజంతా పనిచేసే శక్తి లభించేదని తెలిపారు. ఫాస్ట్‌ఫుడ్‌, బర్గర్‌, పిజ్జాల కంటే చద్దన్నం శరీరానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. దివంగత కృష్ణచంద్రగజపతి నారాయణదేవ్‌ ప్రత్యేక ఒడిశా కోసం బ్రిటీష్‌ వారితో పోరాడినప్పుడు లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో వారికి చద్దన్నం పరిచయం చేసినట్లు బినోదిని సైన్స్‌ కళాశాల అధ్యక్షుడు మనోజ్‌ పట్నాయక్‌ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పొఖాలొ పోటీల్లో పాల్గొని, విజేతలైన విద్యార్థులకు బహమతులు అందజేశారు. ఒడిశా సాహిత్య అకాడమీ సభ్యులు బిచిత్రానంద బెబర్తా వ్యాఖ్యాతగా, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్‌, స్టేట్‌బ్యాంకు విశ్రాంత అధికారి హరిమోహన్‌ పట్నాయక్‌, నర్సింగ పట్నాయక్‌, లోకనాథ మిశ్రా తదితరులు పొఖాలొ ప్రాముఖ్యతపై మాట్లాడారు. అనంతరం అతిథులకు చద్దన్న, గంజి, బంగాళదుంప వేపుడు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అప్పడాలతో పొఖాలొ వడ్డించారు.

సంప్రదాయంగా పొఖాలొ దివాస్‌

చద్దన్నం విందు ఆరగించిన

సీఎం నవీన్‌, ప్రముఖులు

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top