
మాట్లాడుతున్న జేఎన్‌టీయూ జీవీ వీసీ ప్రొఫెసర్ వెంకటసుబ్బయ్య
విజయనగరం అర్బన్: సివిల్ ఇంజినీరింగ్‌కు మంచి డిమాండ్ ఉందని, కాలానుగుణంగా ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను విద్యార్థులు మెరుగుపరుచుకోవాలని జేఎన్‌టీయూ విజయనగరం గురజాడ (జీవీ) వీసీ ప్రొఫెసర్ కె.వెంకటసుబ్బయ్య పిలుపునిచ్చారు. ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ప్రగతి టూకె 23’ పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియంను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సివిల్ ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. తరగతిగదిలో నేర్చుకున్న విజ్ఞానానికి అనుగుణంగా ప్రయోగాత్మాక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతానికి స్వచ్ఛమైన నీటిపంపిణీ వ్యవస్థను రూపొందించే అవకాశం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉంటుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బి.ఉమాశంకర్ మాట్లాడుతూ సమాజాభివృద్ధికి సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులపాత్ర కీలకమన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.శ్రీకుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించే టెక్నికల్ సింపోజియం సదస్సులకు హాజరయ్యే విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుందన్నారు. సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీనివాసప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు టీవీఎస్ డి.ఫరీంద్రనాథ్, ఆర్.బాలమురళీకృష్ణ కో ఆర్డినేటర్లుగా వ్యవహరించారు. స్టూడెంట్ కో ఆర్డినేటర్లుగా ఎం.అజయ్‌కుమార్, బి.సాయిచందన వ్యవహరించారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల నుంచి 80 మంది విద్యార్థులు హాజరయ్యారు.
సాంకేతిక నైపుణ్యాలను
మెరుగుపరచుకోవాలని విద్యార్థులకు వీసీ పిలుపు
జేఎన్‌టీయూ జీవీలో ‘ప్రగతి టూకె 23’ సదస్సు ప్రారంభం