
రాజాం: మనిషికి ప్రాణవాయువును అందించేవి చెట్లు. వాటిపైనే మానవ జీవనం ఆధారపడి ఉంది. పర్యావరణ సమతుల్యతకు అడవులే ప్రధానం. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 18 శాతం (విజయనగరంలో 6శాతం, పార్వతీపురం మన్యంలో 12 శాతం) అటవీ విస్తీర్ణం ఉంది. ఇది 33 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని అటవీశాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. అటవీ విస్తీర్ణం పెరిగిన నాడు వన్యప్రాణాలు జనసంచార ప్రాంతాల్లోకి రావని, పంటలు నాశనం చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఈ నెల 21న అటవీదినోత్సవాన్ని పురస్కరించుకుని అడవుల ప్రాధాన్యంను ఊరూరా వివరించేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో పచ్చదనం పెంచేలా...
విజయనగరం జిల్లాలో అటవీశాతం పెంచేందుకు అవకాశం లేదు. ఎక్కువ వ్యవసాయాధారిత భూములే ఉన్నాయి. 6 శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు జిల్లా అటవీశాఖ వినూత్న ప్రయోగాలు చేస్తోంది. గతేడాది 5 లక్షలు మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుంది. 40 వేల మొక్కలను రహదారులు, చెరువు గట్లు, పొలాలు గట్లపై నాటేందుకు పంపిణీచేసింది. నర్సరీలు ద్వారా రైతులు పంటపొలాల్లో వేసేందుకు 50 వేల మొక్కలు మేర పంపిణీ చేయగా, నగర వనాలు పథకానికి మరికొన్ని మొక్కలను అందజేసింది. వీటితో పాటు ఉపాధి హామీ పథకం కింద మరో 50 వేల మొక్కలు పంపిణీ చేసి సంరక్షించే చర్యలు చేపట్టింది. జిల్లాలో పూల్‌బాగ్, వెలగాడ, గంటికొండ, మారిక, కోనూరు తదితర ప్రాంతాల్లో అడవులు విస్తీర్ణం అధికంగా ఉంది. సారిపల్లి వద్ద నగర వనం కార్యక్రమాన్ని గతేడాది జిల్లా ఫారెస్ట్ శాఖ ప్రారంభించింది. మరోవైపు టేకు, చందనం మొక్కల పెంపకానికి రైతులను ప్రోత్సహిస్తున్నట్టు జిల్లా అటవీశాఖ అధికారి ఎస్.వెంకటేష్ తెలిపారు.
విజయనగరం జిల్లాలో 6 శాతమే అడవులు
జిల్లా విభజన తరువాత తగ్గిన విస్తీర్ణత శాతం
జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మొక్కలు పంపిణీకి ఏర్పాట్లు
ఇప్పటికే 1.40 లక్షల మేర పంపిణీ
నేడు అటవీదినోత్సవం