విజయనగరం అర్బన్: ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో ఈ నెల 22న ఉదయం 9 గంటలకు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత ఏర్పాట్లపై జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు సోమవారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా శాఖలకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. వేడుకల్లో భాగంగా అన్నమాచార్య కీర్తనలు, వేదపఠనం, పంచాంగ శ్రవణం, అతిథుల సందేశాలు ఉంటాయన్నారు. వేడుకల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జేసీ, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు భాగస్వామ్యం అవుతారని వెల్లడించారు. జిల్లా ప్రజలు ఉగాది వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశామని డీఆర్వో పేర్కొన్నారు.