జంతర్‌ మంతర్‌ హోదా రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు | Supreme Court On Key Comments On Jantar Mantar Plea | Sakshi
Sakshi News home page

జంతర్‌ మంతర్‌ హోదా రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Oct 15 2026 1:19 PM | Updated on Oct 15 2026 1:49 PM

Supreme Court On Key Comments On Jantar Mantar Plea

సాక్షి, న్యూఢిల్లీ: జంతర్‌ మంతర్‌ను నిరసనల ప్రదేశంగా గుర్తించే హోదాను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఒకవేళ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

న్యాయవాది స్వాతి సింగ్‌ మాలిక్‌ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. జంతర్‌ మంతర్‌ హోదా రద్దు చేస్తూ ఢిల్లీ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సవాలు చేశారు. నిరసనలను నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు తరలిస్తే.. అధికారులకు తమ సమస్యలను తెలియజేసే అవకాశం తగ్గిపోతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతం కలిగించవచ్చని వాదించారు.

జంతర్‌ మంతర్‌ హోదా రద్దు నిర్ణయం సుప్రీంకోర్టు వ్యాఖ్యల ఆధారంగా తీసుకున్నదా? లేదంటే ఆ ప్రాంతం నిరసనల వేదికగా ఎంతవరకు ఉపయోగకరమన్న అంశంపై స్వతంత్రంగా పరిశీలించి నిర్ణయించారా? అని కూడా ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశాన్ని పరిశీలించి.. సమగ్ర నివేదిక సమర్పించిందని కోర్టుకు వివరించారు.

‘నిరసనకారుల మాటలు అధికారులకు చేరాలి’
విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫున వాదించిన మాజీ న్యాయమూర్తి, సీనియర్‌ న్యాయవాది ముక్తా గుప్తా.. నిరసనకారుల మాటలు అధికారంలో ఉన్నవారికి చేరే ప్రదేశంగా జంతర్‌ మంతర్‌ ఉండాలని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చి స్పందిస్తూ.. ‘‘వినడం అనే పదాన్ని సాంకేతికత కోణంలోనూ అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు. 

ప్రత్యామ్నాయ వేదికలుగా మూడు ప్రాంతాలు
అక్టోబర్‌ 11న ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ కుమార్‌ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జంతర్‌ మంతర్‌ హోదాను తొలగించి, నిరసనలకు ప్రత్యామ్నాయ వేదికలుగా రాంలీలా మైదాన్‌, బురారీ మైదాన్‌, తూర్పు ఢిల్లీలోని సీబీడీ మైదాన్‌లను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు (ఎస్‌ఓపీలు) విడిగా జారీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే రాంలీలా మైదాన్‌లో గతంలో అనేక రాజకీయ నిరసనలు, ధర్నాలు జరిగాయి. అయితే బురారీ, షాహదరాలోని సీబీడీ మైదానాల్లో చాలా కాలంగా ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ వేదికలు ప్రజలకు అందుబాటులో ఉండటం, నిరసనల ఉద్దేశం అధికారులకు చేరే అవకాశం వంటి అంశాలు ఈ వివాదంలో కీలకంగా మారాయి.

ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్‌
జంతర్‌ మంతర్‌ హోదా రద్దుపై ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్‌ దాఖలైంది. ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉదయ్‌ భాను చిబ్‌.. నిరసనకు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూనే.. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌లో కొత్త ఉత్తర్వులను కూడా సవాలు చేశారు. 

జంతర్‌ మంతర్‌ను డీనోటిఫై చేయడాన్ని కాంగ్రెస్‌ సహా విపక్షాలు, అలాగే కాక్రోచ్‌ జనతా పార్టీ, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్ణయం ప్రకటించిన మరుసటి రోజే జంతర్‌ మంతర్‌ వద్దకు దూసుకెళ్లిన సీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు.. జాతీయ జెండాలు ప్రదర్శించారు. దీంతో వాళ్లను అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌ కింద తిహార్‌ జైలుకు తరలించారు. ఈ అరెస్టును దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఖండించాయి.

గతంలో జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలపై సంపూర్ణ నిషేధం విధించడం సరికాదని సుప్రీంకోర్టు 2018లో పేర్కొన్న తీర్పును కూడా పిటిషనర్‌ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం, ఢిల్లీ పోలీసుల సమాధానాల తర్వాత సుప్రీంకోర్టు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: మతం మారితే ఇక అంతే!.. సుప్రీం కోర్టు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement