
న్యూఢిల్లీ: భారత సైనిక చరిత్రలో లెఫ్టినెంట్ కల్నల్ రిషిరాజలక్ష్మి చూపిన తెగువ ఎప్పటికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది. యుద్ధంలో ముఖం ఛిద్రమైనప్పటికీ, ఆయన విధినిర్వహణలో దేనికీ వెనుకడుగు వేయలేదు. అందవిహీనంగా మారిన ముఖానికి మాస్క్ ధరించి, తన సాహస పంధాను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు.
మూడు బుల్లెట్లు తగిలాక..
2017లో కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర నిరోధక దాడిలో లెఫ్టినెంట్ కల్నల్ రిషికి మూడు బుల్లెట్లు తగిలాయి. ఒకటి అతని హెల్మెట్‌లో దూరగా, రెండవది అతని ముక్కును చీల్చింది. మూడవది అతని దవడను ఛిద్రం చేసింది. అంతటి స్థితిలోనూ రిషి పోరాటం కొనసాగించారు. అతని చేతిలోని ఏకే-47 ప్రత్యర్థులపై ఉరుముతూనే ఉంది. 28 సర్జరీల తర్వాత రిషి ముఖ కవచాన్ని ధరించి, తిరిగి విధులకు హాజరయ్యారు. రిషి వీరోచిత గాథ తశివ్ అరూర్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’లో ప్రముఖంగా కనిపిస్తుంది. రిషి చూపిన తెగువ అతనికి ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ మ్యాన్’ బిరుదును సంపాదించిపెట్టింది.

తల్లి లక్ష్యం ఎప్పటికీ గుర్తుండేలా..
2024లో, కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడినప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ రిషి సైనిక సహాయక చర్యలకు నాయకత్వం వహించారు. వందల సంఖ్యలో బాధితుల ప్రాణాలను కాపాడారు. తన ముఖాన్ని మాస్క్‌లో దాచుకుని విపత్తు ప్రాంతానికి చేరుకున్న మలయాళీ సైనికుడు అక్కడున్నవారిలో మరింత ధైర్యాన్ని నింపారు. దేశం కోసం తన ముఖాన్ని త్యాగం చేసిన లెఫ్టినెంట్ కల్నల్‌గా రిషి గుర్తింపు పొందారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రిషి తొలుత ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించారు. కానీ సైనికునిగా మారాలనే అతని కోరిక అతన్ని ఆ దిశగా నడిపించింది. కుమారుడు దేశానికి సేవ చేయాలనే అతని తల్లి లక్ష్యం ఎప్పటికీ గుర్తుండేలా రిషి తన పేరు పక్కన తల్లి పేరు జోడించుకున్నారు.

ఫేస్ మాస్క్ ధరించడం వెనుక..
లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజలక్ష్మి దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ‘ఆపరేషన్ ట్రాల్’ సైనిక ఆపరేషన్‌కు నేతృత్వం వహించాడు. వారి బృందం ఒక ఇంట్లోకి చొరబడి అక్కడున్న ఉగ్రవాదులను తరిమికొట్టే ప్రయత్నం చేసింది. దాదాపు పది కిలోగ్రాముల ఐఈడీతో రిషి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. దానిని అక్కడ అమరుస్తుండగా, పైఅంతస్తు నుంచి దూసుకొచ్చిన మూడు బుల్లెట్లు అతనిని తాకాయి. అయితే రిషి తన ఏకే-47 తో పోరాడి ఉగ్రవాదులను తరిమికొట్టాడు. నాటి 15 గంటల ఎన్‌కౌంటర్‌లో సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. రిషి భార్య కెప్టెన్ అనుపమ ఆర్మీ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్. ఆమె భర్తకు వైద్య సేవలు అందించారు. నాటి దాడిలో కోలుకున్నప్పటి నుంచి రిషి ఫేస్ మాస్క్ ధరించడం ప్రారంభించారు.

‘మన లోపాలను అధిగమించాలి’
రిషి ధైర్యసాహసాలకు మెచ్చిప ప్రభుత్వం 2024లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉత్తమ సేవా పతకాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రిషి మాట్లాడుతూ 'నా దేశం నాకు ముఖ్యం. మన లోపాలను మనం దాచిపెట్టుకోవాలి. మన ప్రతిభను హైలైట్ చేయాలి. ఇదే భావన నన్ను ముఖాన్ని కప్పి ఉంచేలా చేస్లోంది. దేశం నన్ను హీరోలా చూస్తున్నప్పటికీ నేనేమీ అంత ప్రత్యేకమైనవాడిని కాదు. భారత సైన్యం నుండి పొందిన కఠినమైన శిక్షణతో ఎవరైనా బలంగా తయారుకావచ్చు. వ్యక్తిత్వం కలిగిన యువకులు దేశానికి అవసరం. వైద్యుల నుండి ఇంజనీర్ల వరకు ఎవరైనా సరే సైన్యంలో చేరవచ్చని లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజలక్ష్మి పిలుపునిచ్చారు.