దియోఘర్‌ రోప్‌వే ప్రమాదం: 40 గంటల తర్వాత ముగిసిన ఆ‘పరేషాన్‌’!

Jharkhand  Deoghar Ropeway Accident: Rescue Operation Completed - Sakshi

Deoghar Ropeway Accident: జార్ఖండ్‌: దియోఘర్‌ రోప్‌వే ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్‌ ఎట్టకేలకు పూర్తైంది. గందరగోళం, సరైన రక్షణ చర్యలు లేకుండానే సహాయక చర్యలు చేపట్టారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో..  మంగళవారం మధ్యాహ్నాం రెండు గంటల ప్రాంతంలో ఆపరేషన్‌ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ సైతం ఒక ప్రకటన విడుదల చేశారు. 

త్రికూట్‌ రోప్‌వే ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్‌ ఎట్టకేలకు పూర్తైంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎయిర్‌ఫోర్స్‌.. ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రజల్ని కాపాడడమే లక్ష్యంగా జరిగినప్పటికీ.. ప్రాణ నష్టం జరిగినందుకు చింతిస్తున్నట్లు హేమంత్‌ సోరెన్‌ తెలిపారు. ఘటనపై దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని అని ప్రకటించారు. అయితే..

మంగళవారం నాటి రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తి అయ్యాక మృతుల సంఖ్య మూడుకి పెరిగిందని సమాచారం. త్రికూట్‌ హిల్స్‌ ప్రమాదం నుంచి మొత్తం 43 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. ఇందులో 12 మందికి గాయాలు అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించింది జార్ఖండ్‌ హైకోర్టు.  ఏప్రిల్‌ 26న ఈ కేసులో వాదనలు విననుంది. అయితే అంతకు ముందు.. దర్యాప్తు నివేదికను జార్ఖండ​ ప్రభుత్వం అఫిడవిట్‌ రూపంలో ఫైల్‌ చేయాల్సి ఉంటుంది.  

ఇక మంగళవారం ఉదయం 5 గంటల నుంచే రెస్క్యూ సిబ్బంది చర్యల్లో పాల్గొన్నారు. ఇవాళ పది మందిని రక్షించినట్లు డిప్యూటీ కమిషనర్‌ ప్రకటించారు. దేశంలోనే 766 మీటర్ల పొడవైన అతిపెద్ద రోప్‌వే టూరిజంగా పేరున్న త్రికూట్‌ రోప్‌వేపై ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 

శ్రీరామ నవమి రోజున ఆనందంగా గడిపేందుకు వచ్చిన పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. దేవ్‌గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో బాబా బైద్యనాథ్ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని త్రికూట పర్వతంపై వెళ్లేందుకు రోప్‌ వే‌ ఎక్కుతుంటారు. ఆదివారం ఆ రోప్‌ వే ద్వారా నడిచే కేబుల్ కార్లు సాంకేతికలోపంతో ప్రమాదానికి గురయ్యాయి. కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. పలువురు గాయపడగా.. 12 క్యాబిన్లలో 50 మంది 19 గంటలకుపైగా చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. ఆదివారం ఈ ప్రమాదం జరగ్గా.. సుమారు 40 గంటలపాటు కేబుల్‌ కార్‌లలో చిక్కుకున్న వాళ్లను రక్షించేందుకు ఆపరేషన్‌ కొనసాగింది.  

గాల్లోనే ప్రాణాలు గాల్లోనే.. 
ఇదిలా ఉండగా.. రెస్క్యూ ఆపరేషన్‌పై ప్రతికూల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆలస్యంగా సహాయక చర్యలు మొదలుకాగా.. రెస్క్యూ ఆపరేషన్‌ సాగదీతగా కొనసాగడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి.  రాకేష్‌ నందన్‌ అనే మధ్యవయస్కుడు సేఫ్టీ బెల్ట్‌ తెగిపోయి లోయలో పడిపోవడంతో మరణించాడు. మరో మహిళ తాడు తెగి పడిపోవడంతో మరణించింది. రోప్‌ వే కార్లు అత్యంత ఎత్తులో ఉండడం, పైగా పొగమంచు కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలిగినట్లు అధికారులు వెల్లడించారు. డ్రోన్‌ల సాయంతో ఆహారం, నీటిని సరఫరా చేశారు అధికారులు. అయినప్పటికీ విమర్శలు చల్లారడం లేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top