అట్టుడికిన హస్తిన  | India cockroach party founder detained ahead of protest | Sakshi
Sakshi News home page

అట్టుడికిన హస్తిన 

Oct 17 2026 4:14 AM | Updated on Oct 17 2026 4:14 AM

India cockroach party founder detained ahead of protest

ర్యాలీలో జెండాలతో కదం తొక్కిన యువత, ర్యాలీకి ముందు ఢిల్లీలోని ఆయన నివాసంలో దీప్కేని ప్రశ్నిస్తున్న పోలీసు అధికారి

సీజేపీ తిరంగా ర్యాలీకి భారీగా తరలివచ్చిన యువత

మోదీ, జ్ఞానేశ్‌కుమార్‌లకు వ్యతిరేకంగా సీజేపీ నినాదాలు 

సీజేపీ వ్యతిరేకంగా స్థానిక వ్యాపారుల నినాదాలు 

కన్నాట్‌ ప్లేస్‌ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు 

సీజేపీ నేత దీప్కే, ఏఐఎస్‌ఏ అధ్యక్షురాలు నేహా బోరా అరెస్ట్‌ 

జంతర్‌మంతర్‌ నుంచి కన్నాట్‌ ప్లేస్‌ వరకు బలగాల మోహరింపు

సాక్షి, న్యూఢిల్లీ: జై హింద్‌ నినాదాలతో సెంట్రల్‌ ఢిల్లీ మారుమోగింది. శుక్రవారం కన్నాట్‌ప్లేస్, మండి హౌస్, పాలికా బజార్‌లకు వేలాదిగా విద్యార్థులు, యువత త్రివర్ణ పతాకాలతో తరలివచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ నిరసన కారులు కన్నాట్‌ ప్లేస్‌లో భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. 

కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ‘లెహ్రా దో తిరంగా’ర్యాలీ నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. కన్నాట్‌ప్లేస్‌కు బయలుదేరిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేను, మండి హౌస్‌ వద్ద అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఏ) అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, కన్నాట్‌ ప్లేస్‌ పరిసర ప్రాంతాల్లో 2వేల మంది నిరసనకారులు గుమికూడటంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడం గందరగోళానికి దారితీసింది. 

దీప్కేకు పోలీసుల నోటీసు 
శుక్రవారం ఉదయం ఢిల్లీ పోలీసులు నిరసన ర్యాలీని విరమించుకోవాలంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేకు నోటీసు జారీ చేశారు. ఆయన బస చేస్తున్న ఎన్సీపీ (ఎస్‌పీ) నేత అనీష్‌ గవాండే నివాసానికి వెళ్లి ఈ నోటీసు అందజేశారు. కన్నాట్‌ ప్లేస్‌లో ర్యాలీ నిర్వహించవద్దని, నిషేధాజ్ఞలను ఉల్లంఘించవద్దని సూచించారు. నోటీసును స్వీకరించిన దీప్కే నిరసనను విరమించుకునేందుకు అంగీకరించలేదు. జాతీయ జెండాను ప్రదర్శించడం నేరమా? అంటూ ఆంక్షలను ఆయన ప్రశ్నించారు. 

శాంతియుతంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నా నిరసనగా పరిగణించి అడ్డుకోవడం ఎందుకని పోలీసులను ప్రశ్నిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అభిజీత్‌ కన్నాట్‌ప్లేస్‌కు చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు నోటీసు అందజేసిన కొద్దిసేపటికే అదుపులోకి తీసుకుని, జఫర్‌కలాన్‌ ఠాణాకు తరలించారు. మరోవైపు, కన్నాట్‌ ప్లేస్‌లో గుమిగూడిన నిరసనకారులను చెదరగొట్టారు. 

ర్యాలీ నేపథ్యంలో సెంట్రల్‌ పార్క్‌ లోపల, వెలుపల భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. అదేవిధంగా, మండీ హౌస్‌ వద్ద ఏఐఎస్‌ఏ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు, యువత గుంపులుగా చేరడం, వారిని పోలీసులు చెదరగొట్టడం కొనసాగాయి. సుమారు 150 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

సీజేపీకి వ్యతిరేకంగా వ్యాపారుల నినాదాలు 
కన్నాట్‌ప్లేస్‌కు భారీగా చేరుకున్న నిరసనకారులు పోలీసుల అణచివేత చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించినా అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి స్థానిక వ్యాపారులు భారీ సంఖ్యలో వచ్చి, సీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొన్ని నిమిషాల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరు వర్గాల వారిని అక్కడ నుంచి పంపించేశారు.  

ఆంక్షల వల్లే వ్యాపారాలకు నష్టం: దీప్కే 
ఢిల్లీలో తాము అశాంతిని ప్రేరేపిస్తున్నామన్న ఆరోపణలను అభిజీత్‌ దీప్కే ఖండించారు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం అరాచకం కాదని, అది ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమిక హక్కు అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. శాంతియుత నిరసనల వల్ల వ్యాపారాలు దెబ్బతినవని, ప్రభుత్వం నగరాన్ని మూసివేయడం, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడం, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించడం వల్లే వ్యాపార కార్యకలాపాలకు నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ‘ఈ దేశంలో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించినందుకు జైలుకు వెళ్లాల్సి వస్తే, అందుకు కూడా సిద్ధంగా ఉన్నాం’అని దీప్కే గతంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  

మద్దతుగా జేఎన్‌యూ, డీయూ విద్యార్థులు 
సీజేపీ నిరసనకు మద్దతుగా జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ), ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) సహా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా నిరసనలో పాల్గొన్నారు. వీరిలో ఏఐఎస్‌ఏకు అనుబంధం లేని విద్యార్థులు సైతం ఉన్నట్లు సమాచారం. వారు ఉమ్మడి వేదికపై ర్యాలీగా కదిలి సెంట్రల్‌ పార్క్‌ సమీపానికి చేరుకున్నారు. కన్నాట్‌ ప్లేస్, జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. బారికేడ్లతో రాకపోకలను నియంత్రిస్తూ పరిస్థితిని పర్యవేక్షించారు.

నిరసనలే వివాదానికి కారణం 
సీజేపీ నాయకులు సౌరవ్‌ దాస్, అశుతోష్‌ రాంకా గతంలో జంతర్‌ మంతర్‌ వద్దకు వెళ్లి నినాదాలు చేయడం ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని వారు నినాదాలు చేశారు. మూసివేసిన జంతర్‌ మంతర్‌లో నిరసన తెలిపినందుకు వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరినీ కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించింది. దీంతో సీజేపీ నాయకత్వం పోలీసుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును పరిమితం చేస్తున్నారని ఆరోపిస్తూ తిరంగా ర్యాలీకి పిలుపునిచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement