
పద్దెనిమిదవ శతాబ్దం ఆరంభంలో ప్రపంచ సంపదలో కనీసం 30 శాతం వరకు భారత్‌దే. తర్వాతి వందేళ్లలో భారత్ తన సంపదను కోల్పోతూ వచ్చింది. బ్రిటిషర్‌లు భారత్‌ను వదిలిపెట్టిన 1947 నాటికి అది మూడు శాతంగా మిగిలి ఉంది! అప్పుడే భారత్ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అలీనం అనే ఆలోచన వచ్చింది. దేశ అభివృద్ధి ప్రయోజనాల కోసం అన్ని దేశాలతోనూ స్నేహ సంబంధాలు నెలకొల్పుకోవడమే అలీన విధానం. అయితే రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక.. అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య ప్రపంచం రెండు గ్రూపులుగా విడిపోతున్నప్పుడు ఏ గ్రూపులో చేరాలన్న ప్రశ్న భారత్‌కు ఎదురైంది.
చివరికి తటస్థంగా ఉన్న దేశాలతో ఏర్పాటైన అలీనోద్యమంలో భారత్ భాగమైంది. ఆ కూటమే ‘నామ్’.. నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్. నామ్‌లో ప్రస్తుతం ప్రపంచంలోని మూడింట రెండు దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. తటస్థంగా ఉన్నంత మాత్రాన క్రియా రహితంగా ఉండటం కాదని, స్వతంత్ర విధానాలతో ప్రపంచ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించడం అని నెహ్రూ స్పష్టంగా చెప్పారు. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా రెండూ కూడా మనకు ముఖ్యమైనవే. గతంలో అనేక గడ్డు పరిస్థితులో రష్యా మనకు మద్దతుగా నిలిచింది. అలాగని అమెరికాతో మనకు శత్రుత్వమేమీ లేదు. తాజాగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో భారత్ మరోసారి.. ఆ గట్టునా? ఈ గట్టునా? అని నిర్ణయించుకోవలసిన సందర్భం ఎదురైంది. దాంతో ఉక్రెయిన్‌పై ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌కు దూరంగా ఉండటం ద్వారా తమకు అమెరికా, రష్యా రెండూ ముఖ్యమే అని భారత్ తేల్చి చెప్పింది.