మొండి బకాయిలపై కొరడా! | Sakshi
Sakshi News home page

మొండి బకాయిలపై కొరడా!

Published Sat, Nov 18 2023 1:52 AM

బకాయి ఉన్న పరిశ్రమ గేటుకు నోటీసు అతికించిన ఎస్‌ఈ ఉమాపతి, విద్యుత్‌ అధికారులు  (ఫైల్‌) - Sakshi

కర్నూలు(రాజ్‌విహార్‌): విద్యుత్‌ బకాయిలపై ఆ సంస్థ కొరడా ఝుళిపిస్తోంది. మొండి బకాయి ఉన్న వినియోగదారుల ఆస్తులు జప్తు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లుల వసూలుకు చర్యలు తీసుకుంటోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అన్ని కేటగిరీల్లో 16.54 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో లో టెన్షన్‌ (ఎల్‌టీ) కనెక్షన్లు అత్యధికంగా ఉన్నాయి. హై టెన్షన్‌ (హెచ్‌టీ) కనెక్షన్లు 694 ఉన్నాయి. ఎల్‌టీ సర్వీసుల్లో 95 శాతం బిల్లులు నెలనెలా వసూలవుతున్నాయి. కొన్ని హెచ్‌టీ కనెక్షన్లకు సంబంధించిన బకాయి మాత్రం రావడం లేదు. తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థకు ఇవి భారంగా మారడంతో వీటిని వసూలు చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినా స్పందించకపోవడంతో రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్‌ఆర్‌ ఆక్టు) అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక రెవెన్యూ అధికారుల సహాయంతో ఆస్తులు జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

నోటీసులు సిద్ధం

కల్లూరు మండలం లక్ష్మీపురంలోని శ్రీ బాలాజీ టీఎంటీ రాడ్‌ మిల్స్‌ నుంచి రూ.4.62కోట్ల బకాయి రాబట్టేందుకు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. తాజాగా మరో 21 మంది పరిశ్రమ యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పరిశ్రమల నుంచి రూ.400కోట్ల బకాయి వసూలు కావాల్సి ఉంది. హెచ్‌టీ కింద కనెక్షన్లు తీసుకొని, వేల యూనిట్లు వినియోగించుకున్నా తగిన బిల్లులు చెల్లించకపోవడంతో వాటిని మొండి బకాయిలుగా నిర్ధారించారు. ఆయా పరిశ్రమల ఆస్తులను వేలం వేసి, వచ్చిన నగదుతో బిల్లుల కింద జమ చేసుకునే చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారం అందించాలని విద్యుత్‌ శాఖ అధికారులు కోరారు. సంబంధింత తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు.

నెల రోజుల్లోపు చెల్లించాలి

ప్రతి నెలా ఇచ్చే డిమాండ్‌ నోటీసులకు స్పందిచకపోవడంతో ఫాం–ఏ, ఫాం–బీతోపాటు ఫైనల్‌ నోటీసుగా ఫాం–సీని కూడా జారీ చేయనున్నారు. ఆర్‌ఆర్‌ ఆక్టు ప్రయోగంలో భాగంగా ఇప్పటికే ఎస్‌ఈ, ఎస్‌ఏఓ, రెవెన్యూ అధికారులతో కలిసి ఆయా సంస్థలకు నోటీసుల అంటించారు. నెల రోజుల్లోపు బిల్లు చెల్లించాలని, లేనిపక్షంలో ఆస్తులు జప్తు చేస్తామని అందులో పేర్కొన్నారు.

ఆర్‌ఆర్‌ యాక్టు ఉపయోగించేందుకు సిద్ధమైన విద్యుత్‌ శాఖ అధికారులు

ఉమ్మడి జిల్లాలో రూ.400 కోట్లకు చేరిన బకాయిలు

నెల రోజుల్లో చెల్లించని పక్షంలో ఆస్తుల వేలానికి కసరత్తు

ఒక్క రూపాయి బకాయి ఉన్నా చెల్లించాల్సిందే

విద్యుత్‌ బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినా స్పందించని పరిశ్రమలకు ఫామ్‌–బీ నోటీసు అంటించాం. నిర్ణీత గడువులోపు స్పందించకపోతే ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆస్తులు జప్తు చేస్తాం. ఒక్క రూపాయి బకాయి ఉన్నా చెల్లించాల్సిందే.

– ఎం. ఉమాపతి, ఎస్‌ఈ, కర్నూలు

Advertisement
Advertisement