దేశంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోంది | Sakshi
Sakshi News home page

దేశంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోంది

Published Wed, Apr 17 2024 2:20 AM

 సమావేశంలో మాట్లాడుతున్న జానారెడ్డి - Sakshi

రాహుల్‌గాంధీ ప్రధాని అవడం ఖాయం

కేసీఆర్‌, కేటీఆర్‌లకు మతిభ్రమించింది

రఘువీర్‌రెడ్డిని లక్ష మెజారిటీతో

గెలిపించాలి

మిర్యాలగూడ కాంగ్రెస్‌ సమావేశంలో ఉత్తమ్‌, కోమటిరెడ్డి, జానా

మిర్యాలగూడ: బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారని, దేశంలో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలి వీస్తుందని రాష్ట్ర భారీ నీటి పారుదల, సివిల్‌ సప్లయ్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌ఎస్పీ క్యాంపు గ్రౌండ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణను అవమానించి హేళన చేసిన ఘనత ప్రధానమంత్రి మోదీకే దక్కుతుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఊసేలేదని, బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు దూరమయ్యారని, ఆ పార్టీల పట్ల ప్రజలకు నమ్మకం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి పని కూడా చేయలేదని, ఒక ఇల్లు కూడా కట్టలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను కూడా అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పని ఖతం అయిందన్నారు. ఎమ్మెల్సీ కవిత జైలుకు పోవడంతో తండ్రి కేసీఆర్‌, సోదరుడు కేటీఆర్‌లకు మతి భ్రమించిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తరువాత రేవంత్‌రెడ్డి బీజేపీలోకి పోతాడని అసత్యపు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుర్చీ వేసుకొని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న కేసీఆర్‌ ఇప్పుడు ముసలి వయస్సులో కట్టె పట్టుకొని నడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆసియాలోనే నెంబర్‌ వన్‌ బిజినెస్‌ సెంటర్‌ మిర్యాలగూడకు ఔటర్‌ రింగ్‌రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి కుందూరు రఘువీర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కెతావత్‌ శంకర్‌నాయక్‌, మాజీ ఎమ్మెల్సీ భారతీరాగ్యానాయక్‌, స్కైలాబ్‌నాయక్‌, గాయం ఉపేందర్‌రెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, తలకొప్పుల సైదులు, రామలింగయ్య, కృష్ణయ్య, నందిని, సునీత, ఆరిఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement