విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగొద్దు | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగొద్దు

Published Thu, Mar 28 2024 1:40 AM

సబ్‌ స్టేషన్‌ను పరిశీలిస్తున్న ఎస్‌ఈ చంద్రమోహన్‌  - Sakshi

కొండమల్లేపల్లి : వేసవి దృష్ట్యా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ చంద్రమోహన్‌ అధికారులు, సిబ్బందికి సూచించారు. బుధవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో విద్యుత్‌ శాఖ అధికారులతో నిర్వహించిన డివిజన్‌ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవిలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గృహ, వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్‌ అందించాలని, విద్యుత్‌ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే తక్షణమే పరిష్కరించాలని సూచించారు. పట్టణంలో విద్యుత్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా 100 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కోసం సొంత వాహనాల్లో తీసుకొస్తే దానికి సంబంధించిన ఖర్చులను విద్యుత్‌ శాఖ భరిస్తుందని, ఇందుకు సదరు రైతు తన ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ను కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. అంతకుముందు కొండమల్లేపల్లిలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. సమావేశంలో కొండమల్లేపల్లి డీఈ విద్యాసాగర్‌, దేవరకొండ, నాంపల్లి ఏడీలు సైదులు, సాగర్‌రెడ్డి, ఏఈలు దేవోజినాయక్‌, కావ్య, జమీరుద్దీన్‌, వినోద్‌, సాయిప్రకాశ్‌, మురళి తదితరులు పాల్గొన్నారు.

ఫ విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ చంద్రమోహన్‌

Advertisement
Advertisement