చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా.. మౌనిక, సిరి హీరోయిన్లు నటిస్తున్న తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా ‘పోతిరెడ్డిపల్లి’. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో సోమవారం ఈ చిత్రం ప్రారంభమైంది. జేరమ్ విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ రోయ్య దర్శకత్వం వహిస్తున్నారు.
పూజా కార్యక్రమానికి తెలంగాణ మాజీ డిఫ్యూటీ సీఎం రాజయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, సీనియర్ నటుడు బాబుమోహన్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో మిస్టరీ, హారర్, సస్పెన్స్ అంశాలను మేళవిస్తూ ఈ కథను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కథలోని మలుపులు, పాత్రల స్వభావం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటాయని పేర్కొంది. మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది.


