టాలీవుడ్లో వరుసగా సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ అదిగో ఇదిగో అన్నారే తప్పా.. రిలీజ్ డేట్ ఊసే లేదు. అంటే విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదనే తెలుస్తోంది.
ఇలా పలు సినిమాల విడుదల తేదీలు మారుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’పై పడింది. గతంలో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల విడుదల తేదీల్లోనూ మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు మహేశ్‌బాబు సినిమా విషయంలోనూ అలాంటిదే జరుగుతుందా? అనే చర్చ మొదలైంది.
(ఇదీ చదవండి: నా ముఖం ఉబ్బినట్లు ఉందని.. ఏడాదిగా గ్యాలరీలో..: హీరోయిన్)
వారణాసి విషయానికొస్తే..
మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేశ్‌బాబు రుద్రగా.. శ్రీరాముడి పాత్రలోనూ మెప్పించనున్నాడు. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. కార్తికేయ, కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దాదాపు 120 దేశాల్లో సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే..
విడుదల తేదీ మార్పుపై ప్రచారం
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కీలకం కానున్నాయి. ఇలాంటి సినిమాలకు నిర్మాణానంతర పనులు పూర్తిచేయడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇతర భారీ చిత్రాల విడుదల తేదీల్లోనూ మార్పులు చోటుచేసుకుంటుండటంతో ‘వారణాసి’ విడుదలపై అభిమానుల్లో చర్చ మొదలైంది.
అయితే, ఈ సినిమా విడుదల తేదీ మారబోతోందంటూ జరుగుతున్న ప్రచారానికి ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత లేదు. చిత్రబృందం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సినిమా విడుదలవుతుందా? లేక ఏదైనా మార్పు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.అప్పటివరకు ఈ వార్తలను ఊహాగానాలుగానే చూడాలి మరి.
(ఇదీ చదవండి: గరివిడి లక్ష్మి కాళ్లపై షకలక శంకర్.. చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ..)


