
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆంగ్ల భాష ఆధిపత్యం గురించి ఇటీవల ఓ సదస్సులో మాట్లాడాడు. చాలా ఏళ్ల క్రితం పాశ్చాత్యులు మన దేశానికి వచ్చి వారి భాషను మనపై రుద్దడం వల్లే ఇప్పటికీ ఇంగ్లీష్ ఎక్కువగా వాడుతున్నామన్నాడు. దానివల్లే హాలీవుడ్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోందని, ఫలితంగా వారి బడ్జెట్లు, నటీనటుల పారితోషికాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొన్నాడు.
అందుకే హాలీవుడ్‌లో ఎక్కువ..
హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ఒక్క సినిమాకు తనకంటే వంద రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. ఎక్కువమంది ఆయన భాష (ఇంగ్లీష్)లో సినిమాలు చూడటం వల్లే ఇది సాధ్యమైందన్నాడు. కాబట్టి దక్షిణాది సినిమాలు బాలీవుడ్‌లో విస్తరించినట్లే.. భారతీయ సినిమాలు కూడా పశ్చిమ దేశాల్లో ఎక్కువగా విస్తరించాలని అభిప్రాయపడ్డాడు. విజయ్ అభిప్రాయాన్ని కొందరు విదేశీయులు ఏకీభవించలేదు. వారిలో కంటెంట్ క్రియేటర్ ఫర్హాన్ ఒకరు.
హీరోపై అసహనం
అయితే విజయ్‌ను తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో చేయగా దాన్ని డిలీట్ చేయించాడని అసహనం వ్యక్తం చేశాడు. ఒక యాక్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో నా వీడియో డిలీట్ చేయించాడు.. నేను చెప్పే కథ ద్వారా తనెవరో మీరే తెలుసుకోండి.. ఒక సింహం, పులి కలిస్తే వచ్చేది 'లైగర్'.. నాకు అర్జున్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. తనెప్పుడూ సమయానికి రెడీగా ఉండడు (అర్జున్ రెడ్డి) అంటూ ఆ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పకనే చెప్పాడు.
నేను ఏకీభవించలేదు
ఎక్కువమంది ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి హాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలుంటాయి, ఎక్కువ రెమ్యునరేషన్స్ ఉంటాయి.. వారి సినిమాలు ఎక్కువ సక్సెస్ అవుతాయి అని సదరు హీరో అన్నాడు. దాన్ని నేను ఏకీభవించలేదు. విదేశాల్లో కూడా అనేక భాషలున్నాయి. చాలా భాషల్లో తక్కువ బడ్జెట్‌తో వచ్చిన చిత్రాలు హిట్లు కొడుతున్నాయి. కానీ భారీ బడ్జెట్‌తో తీసిన ఆయన సినిమా మాత్రం విజయవంతం కాలేకపోయింది అని చెప్పాను. అంతే.. దాన్ని తట్టుకోలేక డిలీట్ చేయించాడు.
సినిమా
ఇప్పుడా వీడియోను సోషల్ మీడియాలో మళ్లీ అప్‌లోడ్ చేస్తే కచ్చితంగా తీసేయిస్తాడు. మరీ ఇంత అభద్రతాభావానికి లోనైతే ఎలా? ఎవరో ముక్కూమొహం తెలియని వ్యక్తి విమర్శించినా తట్టుకోలేవా? అని ప్రశ్నించాడు. ఇకపోతే అతడు విజయ్‌ను విమర్శిస్తూ చేసిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో ఇంకా అలాగే ఉంది. కాగా విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు, గీతా గోవిందం, టాక్సీవాలా, అర్జున్ రెడ్డి, ఫ్యామిలీ స్టార్, ఖుషి, లైగర్, కింగ్డమ్ చిత్రాల్లో నటించాడు.