
‘‘ఉఫ్ఫ్ యే సియా పా’ చిత్రానికి పని చేయడం సవాలుతో కూడుకున్నది. కానీ పనిలో స్వేచ్ఛ దొరికింది. చాలా సినిమాల్లో సంభాషణలకు ప్రాధాన్యం ఉండి, సంగీతం ఒక అడుగు వెనక్కి వెళ్తుంటుంది. కానీ ఇక్కడ సంగీతం కూడా కథనంలో ఒక భాగం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథనాన్ని నడిపించే ఇలాంటి అవకాశాలు చాలా అరుదు. సంగీతంలో కొత్త శైలితో ప్రయోగాలు చేయడాన్ని నిజంగా ఆనందించాను’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు.
సోహుమ్ షా, నుష్రత్, నోరా ఫతేహి ప్రధాన పాత్రధారులుగా జి. అశోక్ దర్శకత్వంలో లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘ఉఫ్ఫ్ యే సియా పా’. సంభాషణలు లేకుండా నటీనటుల హావభావాలతో రూ పొందిన ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది.
ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఓ పార్సిల్ డెలివరీ వల్ల కేసరి లాల్ సింగ్ (సోహుమ్ షా) జీవితం గందరగోళంలో పడుతుంది. తమ పొరుగింటి కామినితో తన భర్త కేసరి లాల్ సరసాలాడుతున్నాడని అనుమానించి, పుష్ప (నుష్రత్) పుట్టింటికి వెళ్తుంది. ఆ తర్వాత కేసరి లాల్ జీవితంలో ఏం జరిగింది? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది.