
విద్యుత్‌శాఖలో అక్రమ బదిలీలు
● నిబంధనలకు విరుద్ధంగా జారీ ● రద్దు చేయాలని ఫిర్యాదు
మెదక్ కలెక్టరేట్: విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నిబంధనలకు విరుద్ధంగా జారీచేసిన బదిలీ ఆర్డర్లను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ విద్యుత్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శంకర్ 30న తన రిటైర్మెంట్ రోజు రాత్రి 9 గంటలకు బదిలీల ఆదేశాలు ఇచ్చారన్నారు. ఉన్నతాధికారులు ఈ అక్రమ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే సీఎండీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సత్యనారాయణ, అశోక్, శేఖర్, కిరణ్, నాగరాజు, ప్రతాప్‌రెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.