
అడుగుకో గుంత.. తప్పని చింత
రామాయంపేట(మెదక్): అది అత్యంత ప్రాధాన్యత గత అంతర్ జిల్లా లింకు రోడ్డు. మెదక్– కామారెడ్డి జిల్లాలలోని పల్లెలను కలుపుతూ వెలుతున్న ఈ రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. ఫలితంగా రెండు జిల్లాల పరిధిలోని గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేవలం 11 కిలోమీటర్ల పరిధిలో రోడ్డుపై 135 గుంతలు ప్రమాదకరంగా మారాయి.
రెండుసార్లు రద్దయిన టెండర్లు
మండలంలోని లక్ష్మాపూర్, కాట్రియాల, దంతేపల్లి, పలు గిరిజన తండాలను కలుపుతూ కామారెడ్డి జిల్లాకు ఈరోడ్డు అనుసంధానమైంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వాహనదారులు ఈ దారిలో ప్రయాణాలు సాగిస్తారు. కామారెడ్డి జిల్లాకు చెందినవారు మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, జోగిపేట, తదితర ప్రాంతాలకు వెళ్లడానికి ఇదే దగ్గరి రహదారి. రామాయంపేట మీదుగా వెళితే దూరం పెరుగుతుంది. దంతేపల్లి, కాట్రియాల, పర్వతాపూర్, లక్ష్మాపూర్, పలు గిరిజన తండాలకు చెందిన ప్రజలు కామారెడ్డి, నిజామాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈరోడ్డు మార్గం ద్వారానే వెలుతారు. ఇంతటి ప్రాధాన్యం గల ఈ రహదారి శిథిలమై మూడేళ్లు గడుస్తున్నా, అదికారులు, ప్రజాప్రతినిధులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రామాయంపేట– మెదక్ రోడ్డును కలుపుతూ మండలంలోని లక్ష్మాపూర్, దంతేపల్లి, మీదుగా కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం ఆరేపల్లి వరకు 11 కిలోమీటర్ల మేర తారు రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది. ఈ రహదారి బాగు కోసం గత ప్రభుత్వంలో రూ. రెండున్నర కోట్లు మంజూరు కాగా, పనులు నిర్వహించడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా టెండర్ రద్దయింది. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు మరమ్మతుకు రూ. 4.24 కోట్లు మంజూరు కాగా, టెండర్ పిలిచారు. ఈసారి కూడా ఎవరూ ముందుకు రాలేదు. పూర్తిగా గుంతలమయంగా మారిన రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డును పూర్తిస్థాయిలో మరమ్మతు చేయించాలని పలువురు కోరుతున్నారు.
మరమ్మతులకు నోచుకోనిఅంతర్ జిల్లా లింక్ రోడ్డు
11 కిలో మీటర్ల ప్రయాణం నరకప్రాయం
ఇబ్బంది పడుతున్న వాహనదారులు

అడుగుకో గుంత.. తప్పని చింత