
సింగూరుపైనే ఆశలు
పాపన్నపేట(మెదక్): కార్తెలు కరిగిపోతున్నా వరుణుడు కరుణించడం లేదు. మరో పది రోజుల్లో అన్నదాతలు వరి నాట్లకు సమాయత్తమవుతున్నారు. ఘనపురం ఆనకట్టపై ఆశలు పెంచుకున్న రైతాంగం.. సింగూరు నీటి కోసం ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం సాగు నీటి ప్రణాళిక సిద్ధం చేయలేదు. మరోవైపు ఘనపురం కాల్వల ఆధునీకరణ పనులు పూర్తి కాలేదు. దీంతో కర్షకులకు ఖరీఫ్ సాగు ముళ్లబాటలా మారింది.
మరో 10 రోజుల్లో వరి నాట్లు
మెతుకుసీమ రైతన్నల ఆశల వారధి ఘనపురం సుమారు 30 వేల ఎకరాల పంటలకు ప్రాణం పోస్తుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా, పూడికకు గురికావడంతో ప్రస్తుతం 0.135 టీఎంసీలకు పడిపోయింది. దీంతో సింగూరు ప్రాజెక్టు నీటి విడుదల పైనే ఘనపురం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చాలామంది రైతులు వర్షాలను నమ్ముకుని ఇప్పటికే వరి తుకాలు పోశారు. అయితే ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ప్రస్తుతం ఆరుద్ర కార్తె కొనసాగుతుంది. మరో 10 రోజుల్లో వరి నాట్లు వేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఘనపురం ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు ఏ మూలకు సరిపోదు. కనుక సింగూరు నీరు వదలాలని రైతులు కోరుతున్నారు.
ప్రాజెక్టులో 19.2 టీఎంసీలు..
ఇటీవల ఎగువన కురిసిన వర్షాలతో సింగూరులో కొంతమేర నీరు చేరింది. ప్రస్తుతం 19.2 టీఎంసీల (521 మీటర్లు) నీరు నిల్వ ఉంది. మిషన్ భగీరథకు నీరు వదలాలంటే, ప్రాజెక్టులో కనీసం 520 మీటర్ల నీరు నిల్వ ఉండాలి. దీనిని బట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఖరీఫ్ సాగుకు ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడిచే అవకాశాలు తక్కువే అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం తప్పని పరిస్థితి అనుకుంటేనే నీరు విడిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ వర్షాలు పడకపోతే, ఘనపురం రైతులకు గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి.
కాల్వల ఆధునీకరణకు గ్రహణం
ఘనపురం ప్రాజెక్టు కింద ఉన్న మహబూబ్‌నహర్, ఫతేనహర్ కెనాల్‌ల ఆధునీకరణ పనులు ప్రారంభమై మూడేళ్లు దాటినా ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో చివరి ఆయకట్టుకు సాగు నీరు అందడం లేదు. బిల్లులు సకాలంలో రాక, పనులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఆధునీకరణ కోసం రూ. 37.6 కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.21.5 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.16.1 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
కరుణించని వరుణుడు
కరుగుతున్న కార్తెలు
‘ఘనపూర్’కు కావాల్సింది 3 టీఎంసీలు..
ఎదురుచూస్తున్న రైతులు
సాగు నీరు వదలాలి..
వాన దేవున్ని నమ్ముకుని వరి తుకాలు పోశాం. కానీ ఇప్పటి వరకు పెద్ద వానలు పడలేదు. దీంతో వేసిన తుకాలే వాడుముఖం పట్టాయి. వాటిని కాపాడుకోవడానికే తిప్పలు పడుతున్నం. మరో 10 రోజుల్లో వరి నాట్లు వేయాల్సి ఉంది. సింగూరు నుంచి నీరు వదలాలి.
–కుమ్మరి పోచయ్య, రైతు, పాపన్నపేట

సింగూరుపైనే ఆశలు