మంత్రి ఇలాఖాలోనే అధ్వానంగా రోడ్ల నిర్మాణం
● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో
చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి
కర్నూలు(అర్బన్): సాక్షాత్తు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బనగానపల్లె నియోజకవర్గంలో రోడ్ల నిర్మా ణ పనులు చాలా అధ్వానంగా సాగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కొలిమిగుండ్ల నుంచి పెట్ని కోట వరకు (5 కిలోమీటర్లు) రూ.2 కోట్ల వ్యయంతో వేసిన రోడ్డు నెల రోజులకే పాడై పోయిందని, తిరిగి వెంటనే ఈ రోడ్డుపై ప్యాచ్ వర్కులు చేశారంటే, ఎంత నాణ్యతతో ఈ రోడ్డు వేశారో అర్థమవుతోందన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. 7వ స్థాయీ సంఘ సమావేశాల్లో ఆర్‌అండ్‌బీ శాఖపై జరిగిన సమీక్షలో జిల్లాలోని పలు రోడ్ల పరిస్థితిపై సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నందికొట్కూరు–పగిడ్యాల, గార్గేయపురం–మిడ్తూరు రోడ్లు చాలా అధ్వానంగా తయ్యారయ్యాయని జూపాడుబంగ్లా, మిడ్తూరు జెడ్పీటీసీలు పి.జగదీశ్వరరెడ్డి, పి.యుగంధర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశా రు. ఈ రోడ్లకు ఇరువైపులా కంపచెట్లు పెరిగిపోయాయయని, కనీసం ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించడం లేదన్నారు. జిల్లా పరిషత్‌కు బకాయిపడిన స్టాంప్ డ్యూటీని వెంటనే వసూలు చేస్తే జిల్లాలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలవుతుందని, ఈ దిశగా చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి సీఈఓను ఆదేశించారు.
టీడీపీ కార్యాలయంగా మారుతున్న టీబీపీ కార్యాలయం
నియోజకవర్గ కేంద్రం కోడుమూరులోని తుంగభద్ర ప్రాజెక్టు సబ్ డివిజన్ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా మారుస్తున్నారని కోడుమూరు జెడ్పీటీసీ బి.రఘునాథరెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి టీబీపీ కార్యాలయాన్ని లీజుకు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఒక ప్రభుత్వ కార్యాలయానికి పచ్చ రంగులు వేస్తున్నారన్నారు. అయితే సమాధానం ఇచ్చేందుకు సంబంధిత అధికారులు సమావేశానికి రాకపోవడం పట్ల జెడ్పీటీసీ అసహనం వ్యక్తం చేశారు.
అక్రమంగా తరలుతున్న మట్టి
నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల పరిధిలోని కుందూ నది విస్తరణ పనుల్లో తీసివేసిన మట్టిని కొందరు అక్రమంగా 167కే జాతీయ రహదారి (జమ్మలమడుగు – నంద్యాల ) పనులకు తరలిస్తున్నా ఇరిగేషన్ అధికారులు ఏమి చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ప్రశ్నించారు. నదిలో తీసిన మట్టిని జాతీయ రహదారులకు వినియోగిస్తే ఆయా రహదారులు ఎంత మాత్రం నాణ్యతగా ఉంటాయో అధికారులే సమాధానం చెప్పాలన్నారు. ఎవరు తరలిస్తున్నారు ? ఎంత తరలించారనే సమాచారం మీ వద్ద ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అక్రమ మట్టి తరలింపుపై ఫిర్యాదు చేసినట్లు ఇరిగేషన్ అధికారులు చెప్పిన సమాధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వరకు
జలమార్గంపై ఆలోచించండి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వరకు జలమార్గం ఏర్పాటు చేసే అంశాన్ని టూరిజం శాఖ అధికారులు ఆలోచించాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి కోరారు. కార్తీక మాసం, శ్రావణ మాసాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, ఒక్కో సందర్భంలో తీవ్ర ట్రాఫిక్ వల్ల దోర్నాల నుంచి శ్రీశైలం చేరేందుకు దాదాపు 10 గంటల సమయం పడుతోంన్నారు. ఈ నేపథ్యంలో జలమార్గాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపాలన్నారు.
సమావేశాల్లో ఎవరేమన్నారంటే..
● వైఎస్సార్ బీమాను చంద్రన్న బీమాగా పేరు మార్చారు కానీ, ఇప్పటి వరకు ఎంత మందికి బీమా సౌకర్యం కల్పించారు.
– ఎస్.సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ కొత్తపల్లి
● కొత్త పెన్షన్లు ఎప్పుడిస్తారో చెప్పండి, అలాగే వెల్దుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలను మెరుగుపరచండి.
– డి.సుంకన్న జెడ్పీటీసీ, వెల్దుర్తి
● కుంకనూరు గ్రామంలో ఓహెచ్‌ఎస్‌ఆర్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. సోలార్ కనెక్షన్లు తీసుకునేందుకు బ్యాంకర్ల సహకారం లేదు.
– వి.రామక్రిష్ణ, జెడ్పీటీసీ, దేవనకొండ
● హోమియోపతి ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది.
– షేక్ కరీమున్పీసా, జెడ్పీటీసీ, నందికొట్కూరు
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిన ప్రైవేటు పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోవాలని జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యులు తీర్మానం చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా వైద్య సేవలు అందాలని, అలాగే ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా డాక్టర్లు కావాలనే సదుద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా, ప్రైవేటు పరం చేయాలని చూడడం దారుణమని జల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి ఇలాఖాలోనే అధ్వానంగా రోడ్ల నిర్మాణం


