ఆదాయం అదుర్స్‌.. | Sakshi
Sakshi News home page

ఆదాయం అదుర్స్‌..

Published Fri, Mar 29 2024 12:30 AM

పన్ను చెల్లించేందుకు గురువారం కేఎంసీలో క్యూ కట్టిన జనం   - Sakshi

● ఖమ్మం కార్పొరేషన్‌కు పెరిగిన ఆస్తిపన్ను ● రూ.32.81 కోట్లలో రూ.27.10 కోట్ల వసూలు ● కమిషనర్‌, రెవెన్యూ అధికారుల కృషితో ఫలితం ● మిగిలిన మూడు రోజుల్లో మొత్తం రాబట్టేలా చర్యలు

ఖమ్మంమయూరిసెంటర్‌: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రజలు చెల్లించే పన్నులే ప్రధాన వనరులు. ఇందులో అత్యధికంగా ఆస్తి, నల్లా పన్నుల నుండే సమకూరుతుంది. ఈనేపథ్యాన కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, రెవెన్యూ అధికారుల కృషితో ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం పెరిగింది. గతేడాదితో పోలిస్తే పన్నుల వసూళ్లు పెరగగా.. బుధవారం నాటికి రూ.27.10 కోట్లు వసూలు చేసిన అధికారులు భేష్‌ అనిపించుకున్నారు.

గత ఏడాదితో పోలిస్తే పైకి..

కేఎంసీ పరిధిలో నివాస గృహాలు, వ్యాపార సముదాయాలు పెరుగుతుండడంతో ఏటా పన్ను డిమాండ్‌ ౖపైపెకి వెళ్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుల రూపంలో రూ.31 కోట్లు వసూలు చేయాలనేది లక్ష్యం కాగా, రూ.26.62 కోట్లు వసూలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం 79,420 అసెస్‌మెంట్ల సంబంధించి రూ.32.81 కోట్లు ఆస్తి పన్నులు వసూలు చేయాలని లక్ష్యం నిర్దేశించగా.. ఇప్పటివరకు రూ.27.10 కోట్లు వసూలు చేశారు.

పెరిగిన నల్లా పన్ను చెల్లింపులు

ఆస్తి పన్నుతో పాటు నల్లా పన్నుల బకాయిలను చెల్లించేందుకు సైతం నగర వాసులు ఆసక్తి చూపించారు. కేఎంసీ అధికారులు నోటీసులు జారీచేయడమే కాక పదేపదే కలిసి పన్ను చెల్లించాలని కోరుతుండడంతో యజమానులు ముందుకొచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం కేఎంసీ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి ఆధ్వర్యాన నోటీసులు జారీ చేయడమే కాక సెల్‌ ఫోన్‌కు మెసేజ్‌లు పంపించగా, పలువురు చెల్లింపుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈనెల 27న(బుధవారం) ఒకేరోజు రూ.1.23 కోట్లు వసూలు కావడం విశేషం. ఇక గురువారం సాయంత్రానికి అందిన సమాచారం ప్రకారం రూ.80లక్షలు వసూలయ్యాయి. ఆన్‌లైన్‌లో జమ అయిన నగదు కూడా లెక్కిస్తే రూ.కోటి దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

మూడు రోజులే..

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మూడు రోజుల సమయమే ఉంది. దీంతో ఈ సమయంలో మిగతా పన్నులు కూడా వసూలు చేయాలనే లక్ష్యంతో అధికారులు కృషి చేస్తున్నారు. తద్వారా వంద శాతం వసూళ్లతో రికార్డు సృష్టించాలనే ఆలోచనలో ఉన్నారు.

కేఎంసీ పరిధిలో పన్నుల వివరాలు

అసెస్‌మెంట్లు 79,420

డిమాండ్‌ రూ.32.81 కోట్లు

వసూలైన పన్నులు రూ.27.10 కోట్లు

బకాయి రూ.5.71 కోట్లు

మిగిలిన అసెస్‌మెంట్లు 41,310

Advertisement
Advertisement