
రూ.40 కోట్లు చీట్..ఫండ్
బనశంకరి: చిట్‌ఫండ్ అంటే చీటింగ్‌ల మాదిరిగా మారాయి. అవసరానికి ఆదుకుంటుంది అని ఆశపడి చిట్టీలు కట్టి వందలాది ప్రజలు మోసపోయారు. ఈ ఘటన బెంగళూరు పుట్టేనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
వివరాలు..జరగనహళ్లి నివాసులైన సుధా, సిద్దాచారి దంపతులు 20 ఏళ్లుగా చీటీల వ్యవహారాలు నడుపుతున్నారు. ఆ కుటుంబం వద్ద 600 మందికి పైగా స్థానిక ప్రజలు చీటీలు కట్టారు. ఈ మొత్తం రూ.40 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రూ.5 లక్షల నుంచి 10 లక్షల చీటీలు నడిపేవారు.
అర్ధరాత్రి పరార్
సుధా, ఆమె భర్త సిద్దాచారి గత ఏడాదినుంచి ఖాతాదారులకు చీటీల డబ్బు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుధా దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సహా ఇటీవల అర్ధరాత్రి మూటాముల్లె సర్దుకుని పరారయ్యారు. అంతకుముందు బ్యాంకులో తమ బంగారు ఆభరణాలను విడిపించుకున్నారు. ఇంట్లోనే మొబైల్‌ఫోన్‌ను వదిలిపెట్టి విలువైన వస్తువులను తీసుకుని ఉడాయించారు. దంపతులు అదృశ్యం కావడంతో వందలాది మంది చీటీదారులు లబోదిబోమన్నారు. ఇంటి అవసరాల కోసం కట్టామని, ఎంతో నష్టపోయామని, న్యాయం చేయాలని విలపిస్తున్నారు. పుట్టేనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితులు పిర్యాదు చేశారు. వంచక దంపతుల పోలీసులు గాలిస్తున్నారు.
బెంగళూరు పుట్టేనహళ్లిలో మోసం
600 మంది లబోదిబో