
ఏళ్ల నాటి సమస్య తీరేనా?
కామారెడ్డి క్రైం: రైతుల భూ సమస్యలు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో చాలా మంది రైతులు సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ధరణి’ స్థానంలో ‘భూభారతి’ని తీసుకువచ్చింది. ఇటీవలే అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు సైతం నిర్వహించి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా గత నెల ప్రారంభం నుంచి 20 వ తేదీ వరకు నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 32,592 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో దాదాపు 32,015 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
పరిష్కారాల కోసం దాదాపు 13,338 మందికి నోటీసులు జారీ చేశారు. అసైన్‌మెంట్ భూముల క్రయ, విక్రయాలకు సంబంధించిన రికార్డుల అప్‌డేషన్ కోసం 7,932, సాదాబైనామా కోసం 3,452 దరఖాస్తులు వచ్చాయి. పీవోటీపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సాదాబైనామాలకు సంబంధించిన అంశం హైకోర్టు పరిశీలనలో ఉంది. దీంతో ఈ రెండు రకాల దరఖాస్తులకు ఇప్పట్లో పరిష్కారాలు లభించే అవకాశాలు లేవు. కొందరు కోర్టులో కేసు నడుస్తున్నా రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు ఇచ్చారు. మరోవైపు వచ్చిన దరఖాస్తుల్లో పరిష్కరించలేనివి మొత్తం ఎన్ని ఉంటాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
పరిష్కారాలు అంతంత మాత్రమే..
రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై అన్ని గ్రామాల్లోనూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,078 దరఖాస్తులను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవి కాకుండా పైలట్ ప్రాజెక్ట్ కింద లింగంపేట మండలంలో చేపట్టిన భూభారతి సదస్సుల్లో 4,225 దరఖాస్తులు వచ్చాయి. రెండు నెలలు గడుస్తున్నా వాటిలో ఇంకా వెయ్యి సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. దీంతో భూసమస్యల పరిష్కారం వంద శాతం పూర్తి కావాలంటే ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి డిజిటల్ పాస్‌పుస్తకాల్లో పేరు, అడ్రస్, భూమి రకం, విస్తీర్ణం, సర్వే నంబర్ తప్పులు, ఆన్‌లైన్‌లో రికార్డులు లాంటి చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు తహసీల్దార్, ఆర్డీవో, జిల్లా అధికారుల లాగిన్‌లలో పెండింగ్‌లో ఉన్నాయి. అధికార యంత్రాంగం చొరవ తీసుకొని వేగవంతంగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు
ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులు
రెవెన్యూ సదస్సులలో
32,592 దరఖాస్తులు
‘భూభారతి’తోనూ తొలగని ఇబ్బందులు
పరిష్కరించాలి
నాకు గ్రామ శివారులో 2 ఎకరాల పట్టా భూమి ఉంది. ధరణిలో ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. 2019 నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా పరిష్కారం కాలేదు.
– కుంట ఎల్లయ్య, రైతు, బాయంపల్లి,
లింగంపేట మండలం
ఇంకెంత టైం పడుతుందో..
నాకు గ్రామ శివారులో 2 ఎకరాల భూమి ఉంది. ధరణి వచ్చిన తర్వాత డిజిటల్ పాసుపుస్తకం వచ్చింది. కానీ, ఆన్‌లైన్‌లో నా భూమి చూపించడం లేదు. మొన్న జరిగిన రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసిన. అధికారులు విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు.
– కుమ్మరి బాల్‌రాజు, రైతు, భవానీపేట్,
లింగంపేట మండలం

ఏళ్ల నాటి సమస్య తీరేనా?

ఏళ్ల నాటి సమస్య తీరేనా?